Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా కలకలం

Andhra Pradesh: పలు విభాగాల్లోని ఉద్యోగులు కరోనాతో మృత్యువాత * సెకండ్ వేవ్‌లో రెట్టింపు సంఖ్యలో కరోనా బారిన ఉద్యోగులు

Update: 2021-05-23 11:31 GMT

Representational Image

Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులలో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనాతో మృత్యువాత పడ్డారు. అయినా ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తించాలని ఉద్యోగులను కోరుతోంది. దీంతో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా వైరస్‌ బారినపడుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో రెవిన్యూ, విద్యుత్, పోలీస్, దేవాదాయ శాఖ, ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు పలు విభాగాల ఉద్యోగులు కరోనా కాటుకు బలవుతున్నారు. కరోనా మొదటి వేవ్లోను చాలా మంది ఉద్యోగులు కరోనాతో చనిపోయారు. సెకండ్ వేవ్‌లో రెట్టింపు సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.

జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ బారిన పడి రోజుల వ్యవధిలోనే ప్రాణాలను కోల్పోతున్నారు. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవడం, మరణాలూ పెద్ద సంఖ్యలో చోటుచేసుకోవవడం, కార్యాలయాల్లో సహచర ఉద్యోగులతో కలిసిమెలిసి పని చేయాల్సి ఉండటంతో ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. విధులకు హాజరవ్వాలంటేనే భయపడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులు కార్యాలయాలకు హాజరవుతున్నారు.

జిల్లా కేంద్రమైన కాకినాడ నగరంలో వివిద ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ఉద్యోగులు ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెండో దశలో ఇప్పటివరకు విద్యుత్ శాఖలో ఇద్దరు ఏఈ లతోపాటు మరో ఎనిమిది మంది వివిధ కేటగిరిలో పని చేస్తున్న వారు మృతి చెందారు. దేవాదాయ శాఖలో ఉద్యోగులు, అర్చకులు మృత్యువాత పడ్డారు. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటి కార్యదర్శి సన్యాసిరావు, ఎస్ ఐ దేవకీరావు మృత్యువాత పడ్డారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కోసం ప్రత్యేకంగా కోవిడ్ ఆస్పత్రిని తక్షణం ఏర్పాటు చేయాలని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సభ్యులు కోరుతున్నారు.

Tags:    

Similar News