Corona Virus: ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం..తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన

Corona Virus: కరోనా కారణంగా తెలంగాణలో బడులు ముతపడ్డాయి. అయితే ఏపీలో కూడా కరోనా విజృంభించడంతో స్కూల్స్ మూసివేయాని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.

Update: 2021-03-24 04:39 GMT

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Corona Virus: రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. విద్యాసంస్థలపై వైరస్‌ ప్రభావం తీవ్రంగానే ఉంది. పెద్దసంఖ్యలో విద్యార్థులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. అయినా లక్షణాలు ఉన్నవారిని ఇళ్లకు పంపిస్తున్నారు తప్ప హాజరు మినహాయింపు ఇవ్వడం లేదు. పిల్లలందరికీ టెస్టులు చేయించడం లేదు. ఆ బాధ్యతను తల్లిదండ్రులకే వదిలేస్తున్నారు. దీంతో తమ పిల్లల ఆరోగ్యంపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హాజరు తగ్గితే పరీక్షలకు అనుమతించరేమోనన్న భయంతో పిల్లలను బడికి పంపిస్తున్నారు. ముఖ్యంగా టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఎలాగూ సిలబస్‌ చాలావరకు పూర్తయింది కాబట్టి మిగిలిన బోధన ఆన్‌లైన్‌లో చేయిస్తే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు.

కరోనా విస్తృతి నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో.. మరి ఏపీలోని స్కూళ్ల సంగతేంటన్న ఉత్కంఠ తల్లిదండ్రుల్లో నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పాఠశాలలకూ చాపకింద నీరులా ఈ మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా తీవ్రతతో అప్రమత్తమైన కేంద్రం ఏప్రిల్‌ నెలాఖరు వరకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

కానీ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు మాస్కులు ధరించలేక పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోనీ మాస్కు తీసేద్దామనుకుంటే భౌతిక దూరం నిబంధన కూడా పాటించడం లేదు. తరగతి గదుల్లో ఒక్కో బెంచ్‌కి నలుగురు, ఐదుగురు చిన్నారులను కూర్చోబెడుతున్నారు. శానిటైజేషన్‌ చేయడం లేదు. బడికి వెళ్లకపోతే హాజరు సమస్య, వెళితే కరోనా భయం.. ఈ రెండింటి మధ్య చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బడుల్లో కరోనా విజృంభణను పట్టించుకోని సర్కారు.. 1నుంచి ఒంటిపూట బడులు పెట్టాలని నిర్ణయించింది. మే 14 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలు పనిచేసేలా షెడ్యూల్‌ విడుదల చేసింది.

Tags:    

Similar News