TTD: తిరుమల క్షేత్రంలో కరోనా కష్టాలు

TTD: కలియుగ వైకుంఠంగా విరాజిల్లె తిరుమల క్షేత్రంలో కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి.

Update: 2021-05-26 06:26 GMT

తిరుమల దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

TTD: కలియుగ వైకుంఠంగా విరాజిల్లె తిరుమల క్షేత్రంలో కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. గత 14 నెలలుగా వ్యాపారాలు లేక, బోణీ కూడా కాక కరోనా అంతులేని కష్టాన్ని మిగిల్చిందంటూ వాపోతున్నారు. ఆ ఏడు కొండలవాడే తమకు దిక్కంటున్న తిరుమల వ్యాపారుల కష్టాలపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రం ఇప్పుడు వెలవెలబోతోంది. శ్రీవారిని దర్శించుకునె భక్తులు లేక ఇక్కడి వ్యాపారమూ దెబ్బతింది. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేల కుంటుబాలు ఇప్పుడు తిండి లేక అలమటిస్తున్నాయి. తిరుమలలో 3 వేలకుపై దుకాణాలు, వందకు పైగా పెద్ద హోటలు ఉన్నాయి. ఇవే కాక రోడ్డు పక్కన ఉన్న 2 వందల టీ స్టాల్స్ ఇప్పుడు పూర్తిగా మూత బడే స్థితికి వచ్చాయి.

 సాధారణ రోజుల్లో ఒక రోజుకు 3 నుండి 4 కోట్ల మేర వ్యాపారం జరుగుతుండేది. గతేడాది కొవిడ్ కారణంగా మార్చి 21 నుంచి జూన్‌ 7 వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేయడంతో వ్యాపారులు ఇళ్లకే పరిమితమయ్యారు. జూన్‌ 8 నుంచి దర్శనాలు మొదలు కావడంతో తిరిగి వ్యాపారాలు మొదలుపెట్టారు. అక్టోబరు నుంచి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 50 వేలకు చేరడంతో లాక్‌డౌన్‌ కష్టాల నుంచి కొంతమేరైనా బయటపడొచ్చని భావించారు. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ వీరి పాలిట శాపంగా మారింది.

సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌తో ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య 5 వేలకు పరిమితమైంది. ఆ భక్తులు కూడా కరోనాకు భయపడి దర్శనం తర్వాత నేరుగా తిరుగు ప్రయాణమవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లాక్‌డౌన్ ఉండడంతో వచ్చే వారు లేక వ్యాపారం బోణి కూడ కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. టీటీడీకి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ వ్యాపారస్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News