Coronavirus Impact: లాక్‌డౌన్ ఆంక్షలతో తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
Coronavirus Impact: కరోనా పుణ్యమా అంటూ క్షణ కాలం కంటే ఎక్కువసేపు శ్రీవారి దివ్య మంగళ స్వరూపాన్ని భక్తులు కనులారా వీక్షిస్తున్నారు.
Coronavirus Impact: కరోనా పుణ్యమా అంటూ క్షణ కాలం కంటే ఎక్కువసేపు శ్రీవారి దివ్య మంగళ స్వరూపాన్ని భక్తులు కనులారా వీక్షిస్తున్నారు. ఇలా వెళ్లడం అలా రావడం అంతా కేవలం అరగంటలో విఐపీల దర్శనంలా జరిగిపోతుంది. టైంకు వెళ్ళామా శ్రీవారిని కనులారా దర్శించుకున్నామా.. బయటకు వచ్చామా.. ఇది తిరుమలలో ఇప్పటి పరిస్థితి. గతంలో గంటల తరబడి క్యూలో వేచి ఉన్నా దర్శన భాగ్యం కలిగేది కాదు. కాని లాక్‌డౌన్ కారణంగా స్వామివారిని ఎక్కువ సమయం దర్శించుకునే మహాద్భాగ్యం కలిగిందంటున్నారు శ్రీవారి భక్తులు.
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తిరుమల శ్రీనివాసుడు. కోట్లాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడి దర్శనార్ధంకు వచ్చే భక్తుల సంఖ్య ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా ముందు వరకు రోజుకు 60 నుండి 70 వేలు, ప్రత్యేక రోజుల్లో సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. అంటే గంటకు సుమారు 4 వేల నుండి 5 వేల మంది భక్తులు దర్శించుకునేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా పుణ్యామా అంటూ రోజులో కనీసం 5 వేల మంది కూడా స్వామి దర్వనం చేసుకోవడం లేదు. ఇక రష్ తగ్గడంతో డైరక్ట్ క్యూ లైన్ ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు తనివితీరా దర్శనం చేసుకోవడం మాత్రం సంతోషకరమైన విషయం.
కరోనా ఉధృతితో ఇప్పటికే టీటీడీ సర్వదర్శన టోకెన్లను రద్దు చేసింది. ప్రత్యేక ప్రవేశం టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తుంది. మే 1వ తేదీ నుండి రోజుకు 15 వేల మందితో పాటు శ్రీవాణి ట్రస్ట్, వీఐపీ, పర్చువల్ విధానం అలాగే సుపథం మరో 5 వేల మందితో కలిపి రోజుకి సుమారు 20 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ వీలు కల్పించినప్పటికీ భక్తులు మాత్రం దర్శనానికి సుముఖత చూపడం లేదు. మరోవైపు ఏపీలో లాక్‌డౌన్ అమలు కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అంతేకాక అంతరాష్ట్ర రవాణా సైతం స్థంభించడంతో భక్తుల రాక మరింత తగ్గింది.
అయితే రష్ తగ్గడంతో కేవలం 20 నుండి 30 నిముషాల వ్యవధిలో స్వామి దర్శనమవుతుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా స్వామి దర్శనం జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించి ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవచ్చని అంటున్నారు. కరోనా కాలంలో తిరుమలకు వచ్చే భక్తులు మాత్రం స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కళ్లారా తిలకిస్తున్నారనే చెప్పాలి.