Kurnool: తన కొడుకుని అంగన్‌వాడీలో చేర్పించిన కలెక్టర్

Kurnool: ఆదర్శంగా నిలిచిన కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు

Update: 2022-06-05 05:15 GMT

Kurnool: తన కొడుకుని అంగన్‌వాడీలో చేర్పించిన కలెక్టర్ 

Kurnool: ప్రస్తుతం విద్యావ్యవస్థ మొత్తం కార్పొరేట్ సంస్థల చుట్టు తిరుగుతోంది. మధ్యతరగతి, పేద ప్రజలు సైతం తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. తమ స్థోమతకు మించి లక్షలాది రూపాయలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. కానీ ఓ జిల్లా కలెక్టర్ మాత్రం తమ కుమారుడిని అంగన్‌వాడీలో జాయిన్ చేయించి అందరికి ఆదర్శంగా నిలిచారు.

ఇది కర్నూలు నగరంలోని బుధవారపేట అంగన్‌వాడీ ప్రీ స్కూల్. ఇప్పుడు ఈ స్కూల్ గురించి కర్నూలు జిల్లాలో చాలా మంది చర్చించుకుంటున్నారు. అందుకు కారణం జిల్లా కలెక్టర్ పీ. కోటేశ్వరరావు. ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రజలను కొత్త ఆలోచనలో పడేసింది. తాము తిన్నా, తినకపోయినా తమ పిల్లలు మాత్రం మంచి చదువు చదువుకోవాలని ప్రతీ తల్లిదండ్రి ఆశిస్తాడు. అప్పులు చేసి మరి కార్పొరేట్ స్కూల్‌లో తమ పిల్లలను జాయిన్ చేస్తారు. ఖర్చు ఎక్కువైన కార్పొరేట్ స్కూల్‌లో చదివితే తమ పిల్లల భవిష్యత్తు బావుంటుందని తపన. కానీ కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు మాత్రం ఇందుకు భిన్నంగా తన నాలుగేళ్ల కుమారుడు దివి అర్విన్‌ను బుధవారపేట అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో చేర్పించారు.

అంగన్‌వాడీలో దివి అర్విన్ తోటి విద్యార్థులతో సమానంగానే విద్య నేర్చుకుంటున్నాడు. సామాన్య పిల్లలు మాదిరిగానే అందరి మధ్య కూర్చుని చదువుకుంటూ, ఆడుకుంటున్నాడు. అంగన్వాడీ స్కూల్స్‌పై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులకు తగిన సూచనలు ఇస్తూ వస్తున్నారు. అయితే తాను తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానం వల్ల అంగన్వాడీల్లో ఏ మేరకు మార్పు వచ్చింది, పిల్లలు ఎంత వరకు వాటిని అంది పుచ్చుకుంటున్నారనేది స్వయంగా తెలుసుకోవటానికే తన కుమారుడు దివి అర్విన్‌ను అంగన్వాడీలో చేర్పించారు. కలెక్టర్ నిర్ణయంతో మిగతా పేరేంట్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్ స్కూల్స్ అంటూ పరుగులు తీసే పేరెంట్స్ ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలకు మంచి విద్య వస్తుందని నిరూపించేలా కలెక్టర్ అడుగులు వేయటం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తోందని పలువురు అంటున్నారు.

Tags:    

Similar News