పులివెందులకు చెందిన ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి శుక్రవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. గంగిరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా పులివెందులకు చేరుకున్నారు. అనంతరం మామ ఈసీ గంగిరెడ్డి భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తదితరులు నివాళర్పించారు. ఇదిలావుంటే డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లాలో ప్రముఖ వైద్యులుగా గొప్ప సేవలు అందించారని పేర్కొన్నారు.