Antarvedi: లక్ష్మీనరసింహుడి రథం ప్రారంభించిన సీఎం జగన్
Antarvedi: ప్రముఖ పుణ్యక్షేత్రం అతర్వేదిలో(Antarvedi) రథసప్తమి వైభవంగా జరిగింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం అతర్వేదిలో(Antarvedi) రథసప్తమి వైభవంగా జరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో దుండగుల చేతిలో దగ్ధమైన స్వామివారి రథం తిరిగి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్ రథం తాడు లాగి రథాన్ని ప్రారంభించారు. ఎన్నో ప్రత్యేకతలతో రూపొందించిన ఈ రథం భక్తుల హర్షద్వానాల మధ్య ప్రారంభమైంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి నూతన రథం సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇవాళ ఉదయం హెలికాప్టర్‌లో చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథం దగ్గర శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తాడు లాగి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పంచరంగులతో ఆకర్షణీయంగా ముస్తాబయిన రథాన్ని ప్రభుత్వం 95 లక్షల రూపాయలతో సిద్ధం చేయించింది. 41 అడుగుల ఎత్తు, 7 అంతస్థులతో స్వామివారి రథాన్ని సిద్ధం చేశారు. అంతేకాకుండా కేవలం మూడు నెలల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో రథం నిర్మాణం పూర్తి చేయడం విశేషం. అలాగే రథానికి స్టీరింగ్, బ్రేకులు, ఇనుప గేటుతో పూర్తిస్థాయి సెక్యూరిటీ కూడా ఉంది.
ఇవాళ రథసప్తమి రోజు స్వామివారి రథాన్ని ముఖ్యమంత్రి(YSJagan) చేతుల మీదుగా ప్రారంభించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అంతర్వేది ఆలయంలో వైభవంగా జరిగిన రధసప్తమి వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు.