కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్
అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
CM Jagan: ఏపీ సీఎం జగన్ చిత్తూరుజిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారిగా వస్తున్న సందర్భంగా ఎన్నడూ లేనివిధంగా భారీస్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. అనిమిగాని పల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభావేదికను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. సభా ప్రాంగణంలో భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో కుప్పం ప్రత్యేక వాతావరణాన్ని సంతరించుకుంది.
సీఎం జగన్ ఈ రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో 10 గంటల 45 నిమిషాలకు కుప్పం చేరుకుంటారు. కుప్పంలో సీఎం జగన్ దిగేందుకు వీలుగా ప్రత్యేక హెలిపాడ్ ఏర్పాటుచేశారు. కుప్పం చెరువునుంచి సభావేదిక ఏర్పాటుచేసిన అనిమిగానిపల్లిదాకా మూడు కిలోమీటర్లమేర దారిపొడవునా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. జగన్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అడుగడుగునా పోలీసులు ఉండే విధంగా భారీ బందోబస్తుగా కొనసాగుతోంది.
కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రభుత్వ పథకాల పంపిణీ చేయనున్నారు. 66 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు. 11 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభిస్తారు. కుప్పంలో నిర్వహించే సభలో జగన్ చేయూత పథకం కింద 26 లక్షల 39 వేల 703 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించనున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4 వేల 949 కోట్ల 44 లక్షల రూపాయల నిధులను లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. 45 నుంచి 60 యేళ్ల మధ్య ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సంవత్సరానికి 18 వేల 750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో 75 వేలరూపాయలను ఆర్థిక సాయంగా అందివ్వాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.