CM Jagan: నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన
*దావోస్‌లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్న జగన్, మంత్రులు, అధికారుల బృందం
CM Jagan: ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన శుక్రవారం నుంచి మొదలు కానుంది. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జగన్ హాజరుకానున్నారు. ఈ సదస్సుకు హాజరుకానున్న ఏపీ ప్రతినిధి బృందానికి జగనే నేతృత్వం వహించనున్నారు.
రెండేళ్ల కోవిడ్ విపత్తు తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రత్యక్షంగా సమావేశం కానుంది. మే 22 నుంచి 26వరకు జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైయస్.జగన్‌తోపాటు, మంత్రులు, అధికారుల బృందం పాల్గొనున్నారు. కోవిడ్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా వినిపించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కారం కోసం ఈవేదిక ద్వారా ఏపీ భాగస్వామ్యం కానుంది. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్ వేదికగా సీఎం కీలక చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
కోవిడ్ నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన వ్యూహాన్ని దావోస్ వేదికపై రాష్ట్రం వినిపించనుంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ ద్వారా కోవిడ్ కట్టడికి చేసిన విశేష ప్రయత్నాలను వివరించనుంది. ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను, సమగ్ర సాజికాభివృద్ధిలో భాగంగా నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ– సుపరిపాలన, ఉత్తమ భవిష్యత్త్ తరాల నిర్మాణం కోసం విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ఏపీ వివరించనుంది. వీటితోపాటు సంప్రదాయ ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి తదితర అంశాలపైనా ఈ సదస్సులో ఏపీ దృష్టి సారించనుంది.
అన్నికంటే ముఖ్యంగా కాలుష్యంలేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయడంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పారిశ్రామికీకరణలో నాలుగో విప్లవం దిశగా ప్రపంచం కదులుతున్న నేపథ్యంలో దీనిపై ఏపీ దృష్టిపెట్టింది. ఎలాంటి కాలుష్యం లేని విధానాలతో ఉత్పత్తులు సాధించడం, అందుకు తగిన విధంగా వ్యవస్థలను రూపొదించుకోవడం దీంట్లో ప్రధాన ఉద్దేశం. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్ కనెక్టివిటీ, రియల్‌టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌ల పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై దావోస్‌లో విస్తృతంగా జరిగేచర్చల్లో ముఖ్యమంత్రి, రాష్ట్ర బృందం భాగస్వామ్యం అవుతుంది.
ఇండిస్ట్రియలైజేషన్ 4.0కు సరైన వేదికగా నిలిచేందుకు రాష్ట్రానికి ఉన్న వనరులు, అవకాశాలను ఈ సదస్సులో వివరించనున్నారు. ఈదిశగా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను దావోస్ చర్చల్లో వివరించనున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్‌ఈజెడ్ పోర్టులు నిర్మాణం, కొత్తగా మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, నిర్మాణం తదితర వాటి ద్వారా ఇండస్ట్రియలైజేషన్ 4.0కు ఏ రకంగా దోహదపడుతుందో వివరించనున్నారు. బెంగళూరు – హైదరాబాద్, చెన్నై – బెంగుళూరు, విశాఖపట్నం – చెన్నై కారిడార్లలో ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచుతారు. సుశిక్షితులైన మానవవనరుల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్న తీరును వివరిస్తారు.
పారిశ్రామిక వ్యూహాల్లో తీసుకురావాల్సిన మార్పులపైనా దావోస్ వేదికగా ఏపీ దృష్టి సారించనుంది. నేరుగా ఇంటి గుమ్మవద్దకే ఉత్పత్తులు చేరవేసే విధానాన్ని మరింత బలోపేతం చేయడం, దీన్ని డిటిటలైజేషన్‌తో అనుసంధానం చేయడం, రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని మరింత వృద్ధి చేయడం, ఎగుమతులకు అవసరమైన నాణ్యతతో వస్తు ఉత్పత్తులు తయారు చేయడానికి తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లాంటి అంశాలపై అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంపై దావోస్ సదస్సులో ఏపీ దృష్టి పెట్టనుంది. ఈ అంశాలను వివరిస్తూ దావోస్‌లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేసింది. పీపుల్ –ప్రోగ్రెస్ – పాజిబిలిటీస్ నినాదంతో పెవిలియన్ నిర్వహిస్తోంది.