CM Jagan: నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan: రెండో విడత నాడు-నేడు పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం * పోతవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థులతో సీఎం ముఖాముఖి
CM Jagan: ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మనబడి నాడు-నేడు పథకం కింద ఆధునీకరణ పనులు పూర్తిచేసుకున్న పాఠశాలలను విద్యార్థులకు అంకితమివ్వనున్నారు. అదేవిధంగా రెండో విడత నాడు-నేడు పనులను శ్రీకారం చుట్టనున్నారు. పి.గన్నవరం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ చేయనున్నారు.
స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించిన ప్రభుత్వం వాటి ఖర్చుకు దాదాపు 16వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఓవైపు మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు విద్యాకానుక కిట్ల పంపిణీ చేపట్టింది. ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫాంలు, ఒక జత షూ, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అందించనుంది. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కూడా ఇవ్వనున్నారు.
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న ముఖ్యమంత్రి జగన్ 11 గంటలకు పి.గన్నవరం మండలం పోతవరం చేరుకోనున్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో నాడు-నేడు పైలాన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా విద్యార్థులతో మాట్లాడనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.