CM Jagan: ఇవాళ గడప గడపకు వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan: మ.3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం
CM Jagan: ఇవాళ గడప గడపకు వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని గతంలో సీఎం జగన్ ప్రకటించారు. దీంతో.. ముఖ్యమంత్రి ఎవరిపై అసంతృప్తిగా ఉన్నారు..? ఏ నేతలకు క్లాస్ తీసుకోబోతున్నారనే అంశాలు.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం ద్వారా నిత్యం ప్రజల్లో ఉండాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించారు. నెలకు కనీసం పదహారు రోజులు ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఇందుకోసం 8 నెలల టైమ్ బౌండ్ కూడా ఫిక్స్ చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. దీంతో సీఎం జగన్ మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఐ పాక్ టీం ద్వారా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల స్పందన వంటి అంశాలపై ఐ పాక్ టీం నివేదికలు ఇస్తోంది. ఈ సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం నేపథ్యంలో వారి పనితీరుపై ఐ పాక్ టీం రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఆ రిపోర్ట్‌లో ఏముందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత కేబినెట్ సమావేశంలో సరిగా పనిచేయని మంత్రులపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అవసరమైతే కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. చాలామంది ఎమ్మెల్యేలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడంలేదనే చర్చ జరుగుతోంది. అలాంటి వారిని ఇప్పటికే సీఎం జగన్ గుర్తించారు. వారికి మరోసారి హెచ్చరికలతో అవకాశం ఇస్తారా..? లేకుంటే ఉద్వాసన తప్పదనే సంకేతాలు ఇస్తారా అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తి రేపుతోంది.