ఏపీలో అగ్గిరాజేసిన రామతీర్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. బాధ్యులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. రామతీర్థం ఘటనతోపాటు రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం ధ్వంసంపైనా సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి ప్రకటించారు. రామతీర్ధం భౌగోళికంగా చాలా చిన్న ప్రాంతమని, అందువల్ల అక్కడ ర్యాలీలు తీయొద్దని బీజేపీని కోరారు. టీటీడీ అధికారులతో సంప్రదించిన తర్వాత రామతీర్ధంలో విగ్రహ ప్రతిష్ట, ఆలయ పునరుద్ధరణ, ఆధునీకరణ చేపడతామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
ఆలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రామతీర్థం ఘటనపై జగన్ సర్కారు సీరియస్‌గా ఉంది. సీఎం జగన్ ఆదేశాలతో దేవాదాయ, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ భద్రతపై సమీక్ష నిర్వహించారు. దేశాలయాల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఆలోచన చేశారు. అలాగే, దేవాదాయ-పోలీస్ శాఖల సమన్వయంతో ప్రతి ఆలయం దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతోపాటు పోలీస్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
8 ఆలయాల్లో జరిగిన వివిధ ఘటనల్లో 88 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 159మందిని అరెస్ట్ చేసినట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. అలాగే, దేవాదాయశాఖ పరిధిలోని 57వేల 584 ఆలయాలను మ్యాపింగ్ చేశామన్నారు. ప్రస్తుతం 3618 ఆలయాల్లో సీసీటీవీ వ్యవస్థ ఉండగా 39వేల76 సీసీ కెమెరాలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, సీసీ కెమెరాల్లేని ఆలయాల్లో భద్రతా చర్యల కోసం మరోసారి డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.