New 108, 104 in AP: కుయ్..కుయ్ కూతలకు అధునాతన హంగులు!

Update: 2020-07-01 09:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్‌ వ్యవస్థ మళ్లీ ప్రాణం పోసుకుంది. లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్స్‌ వ్యవస్థను మళ్లీ బతికించాలన్న ఉద్దేశంతో సర్కారు నడుం బిగించింది. నేడు ఈ కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్‌. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు, రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా చిన్నారుల కోసం నియోనేటల్‌ కేర్‌ అంబులెన్స్‌లు సైతం రోడ్డు మీదకు రానున్నాయి. వీటితో పాటు సంచార వైద్య శాలలుగా చెప్పుకునే 104 వాహనాలు పల్లెలకు సగర్వంగా తలెత్తుకుని వెళ్లనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం చాలా పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్ ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టిన ప్రభుత్వం తాజాగా అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో తనదైన ముద్ర వేసింది. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 వాహనాల్లో సమూలు మార్పులు చేసి, వాటిని తీర్చిదిద్దింది. 

203 కోట్ల ఖర్చుతో ఒక వెయ్యి 88 108, 104 వాహనాలను కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు. ఎక్కడైన ప్రమాదం అని ఫోన్ వచ్చిన 15, 20 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి ఈ వాహనాలు. ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు ఉంటుంది. అంతేకాదు ప్రతి అంబులెన్సులోనూ ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.

లెటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెంటిలేటర్లు ఏర్పాటు కొత్తగా సిద్ధంగా ఉన్న 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టుకు సంబంధించినవి. 104 వాహనాలను అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టుతో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఈ వాహనాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బీఎల్‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ చైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీపారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో వైద్య సేవలందించేలా లెటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇటు చిన్నారులకు వైద్యం అందించే నియోనేటల్‌ కేర్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు వెంటిలేటర్లను తీర్చిదిద్దారు. సకాలంలో వైద్యం అందక ఏ ఒక్క రూ చనిపోకూడదన్నే ప్రభుత్వ లక్ష్యం. అందుకే అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సులను పెద్ద సంఖ్యలో ఒకేసారి అందుబాటులోకి తీసుకువచ్చింది.

హెల్త్‌ కేర్‌ డెలివరీ విధానంలోనూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను తీర్చిదిద్దింది. మారుమూల ప్రాంతాల్లోనూ అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేసింది. ప్రతి మండలంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండేలా ఒకేసారి 656 సర్వీసులను సిద్ధం చేశారు. ప్రతి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లో ఒక డాక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎంతో పాటు ఆశా వర్కర్‌ ఉంటారు. 104 వాహనం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో అనుసంధానమై ఉంటుంది. ఒకే రోజు రెండు గ్రామాలకు వెళ్లాల్సినప్పుడు ఉదయం ఒక గ్రామానికి, సాయంత్రం మరో గ్రామానికి వాహనం వెళ్తుంది. ప్రతి వాహనం విలేజి క్లినిక్ కు కూడా అనుసంధానమై ఉంటుంది.

గతంలో 52 రకాల మందులు ఉండగా ఇప్పుడు సంఖ్యను 74కు పెంచారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేస్తారు. మాతాశిశు మరణాలను నివారించడం, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీల్లోకొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాల్లో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తూ మొత్తం 20 రకాల సేవలందించడం కోసం 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు 20 రకాల వైద్య సేవలు.. మొత్తం 74 రకాల ఔషధాలు అందజేత కొత్త, పాత అంబులెన్సులతో పాటు మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ప్రతిఏటా రూ. 318.93 కోట్లు ఖర్చు కానుంది. రాష్ట్రంలో గతంలో 108 అంబులెన్సులు 440 చోట్ల మాత్రమే సేవలందించగా.. ఇప్పుడు మొత్తం 705 చోట్ల నుంచి పని సేవలందించనున్నాయి. గతంలో 104 అంబులెన్సులు 292 మాత్రమే ఉండగా ఇప్పుడు మండలానికి ఒకటి చొప్పున మొత్తం 676 సర్వీసులు పని చేయనున్నాయి. 20 రకాల వైద్య సేవలందిస్తూ మొత్తం 74 రకాల ఔషధాలు అందజేయనున్నాయి. ఇంకా వీటిని డాక్టర్‌ వైఎస్సార్‌ టెలి మెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసి నిర్వహించనున్నారు. దీని ద్వారా అన్ని చోట్ల వైద్య సేవలు అందనున్నాయి.

Tags:    

Similar News