Chicken Prices: చికెన్ @ రూ.300.. ఆల్‌టైమ్ రికార్డ్.. కారణాలివే!
Chicken Prices ఎండ తీవ్రతకు చనిపోతున్న కోళ్లు
Chicken Prices: కోడి మాంసం ధర కొండెక్కింది. ఈ ఏడాది తొలిసారిగా కిలో చికెన్ ధర 300కు చేరుకుంది. వారం వ్యవధిలో కిలోకు 50 రూపాయలు పెరిగింది. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కోళ్ల పెంపకం గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు రోజుల తరబడి వడగాలులు వీస్తుండడంతో కోళ్లు చనిపోతున్నాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేసవి కావడంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రత అధికంగా ఉంది. వడగాలులకు వ్యాపారస్థులు కోళ్ల పెంపకాన్నితగ్గించడంతో చికెన్ ధరలు పెరిగాయని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.గత వారంలో కిలో చికెన్ ధర 250 రూపాయలు వరకు ఉండగా..అది కాస్తా ఈ వారం 300కు చేరుకుంది. మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు.
ఎండల తీవ్రత తో కోడిగుడ్ల సరఫరా కూడా తగ్గిపోయింది. దీంతో కోడిగుడ్ల ధరలు కూడా అమాంతం పెరుగాయి. అట్ట 30 గుడ్లు ధర గత వారం వరకు 165 రూపాయలు ఉండగా ప్రస్తుతం గుడ్ల ధర 175కు చేరింది. ఎండల తీవ్రతతో కోడిగుడ్ల సరఫరా కూడా సగానికి సగం పడిపోవడం వల్ల కోడి గుడ్లధరలు పెరుగుతున్నాయి.
ఇదే అదునుగా భావిస్తున్న కొందరు వ్యాపారులు చికెన్ ధరను పెంచి ప్రజలకు విక్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని చికెన్ సెంటర్ ధరకు గ్రామీణ ప్రాంతాల్లోని చికెన్ సెంటర్ ధరకు వ్యత్యాసం ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నచికెన్ సెంటర్‌లలోని ధరలను వారే నిర్ణయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.