మోదీ కేబినెట్‌లో ఏపీ నుంచి ఎవరెవరికి ఛాన్స్.. క్యూ కట్టిన ఆశావహులు..

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి 21 స్థానాలను గెలుచుకుంది. ఇందులో టీడీపీ 16 కైవసం చేసుకోగా, బీజేపీ 3, జనసేన 2 స్థానాలను దక్కించుకుంది.

Update: 2024-06-07 16:30 GMT

మోదీ కేబినెట్‌లో ఏపీ నుంచి ఎవరెవరికి ఛాన్స్.. క్యూ కట్టిన ఆశావహులు..

ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.. ఫలితాలు వచ్చేశాయ్.. ఎవరెవరు ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో క్లారిటీ వచ్చేసింది. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. దీంతో మోదీ కేబినెట్ లో ఏపీ నుంచి ఎవరెవరికి మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుందనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీలు గెలిచిన టీడీపీ ఈసారి ఎక్కువ మంత్రి పదవులను దక్కించుకునే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. మంత్రి మండలిలో స్తానం కోసం కూటమి సీనియర్లు గంపెడాశతో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆశీస్సులు, హామీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జనసేన కార్యాలయంలోనూ ఆశావాహులు క్యూ కట్టారు. కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో బీజిబిజీగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి 21 స్థానాలను గెలుచుకుంది. ఇందులో టీడీపీ 16 కైవసం చేసుకోగా, బీజేపీ 3, జనసేన 2 స్థానాలను దక్కించుకుంది. దీంతో ఈ మూడు పార్టీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం దక్కబోతోందని సమాచారం. మోడీ మంత్రివర్గంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదారు మంత్రి పదవులు దక్కడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి కనీవినీ ఎరుగని మెజారిటీ దక్కడంతో ఆ మేరకు ఏపీకి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని బీజేపీ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

టీడీపీకి కేంద్రంలో నాలుగైదు కీలక పదవులు దక్కుతాయని తెలుస్తోంది. గతంలో గంటి మోహనచంద్ర బాలయోగి టీడీపీ నుంచి స్పీకర్ గా వ్యవహరించారు. ఈసారి కూడా తమకు స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని టీడీపీ కోరుతున్నట్టు సమాచారం. దాన్ని పక్కన పెడితే మోదీ కేబినెట్ లో నాలుగు మంత్రి పదవులను కచ్చితంగా దక్కించుకుంటుందని తెలుస్తోంది. ఇందులో రెండు కేబినెట్ స్థాయి కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులు ఉండొచ్చు. అలా సాధ్యం కాకపోతే ఒక కేబినెట్ తో పాటు మూడు నాలుగు సహాయ మంత్రి పదవులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

కేబినెట్ మంత్రిగా కచ్చితంగా కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయుడు పార్టీకి వీరవిధేయుడు. మోదీకి కూడా రామ్మోహన్ నాయుడంటే ఇష్టం. ఇక మంత్రి పదవులకోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ పడే ఛాన్స్ ఉంది. ఎస్సీ కోటాలో గంటి హరీశ్ మాథుర్, టి.కృష్ణ ప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్ లకు అవకాశం ఉండొచ్చు. మహిళలకు ఇవ్వాలనుకుంటే బైరెడ్డి శబరికి మంత్రి పదవి ఖాయం.

ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కచ్చితంగా కేబినెట్ బెర్త్ దక్కనుంది. మరో స్థానాన్ని కూడా ఇవ్వాలనుకుంటే సీఎం రమేశ్ కు ఆ ఛాన్స్ దక్కొచ్చు. జనసేన నుంచి వల్లభనేని బాలశౌరికి సహాయమంత్రి పదవి దక్కుతుందని చెప్తున్నారు. అయితే ఎవరెవరికి ఎలాంటి శాఖలు దక్కుతాయనే దానిపై క్లారిటీ లేదు.

Tags:    

Similar News