Chandrababu Naidu: ఆందోళన విరమించిన చంద్రబాబు
Chandrababu Naidu: రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు తిరుగు పయనమయ్యారు.
Chandrababu Naidu: రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు తిరుగు పయనమయ్యారు. చిత్తూరు జిల్లా టీడీపీ నిరసనల్లో పాల్గొనేందుకు ఉదయం రేణిగుంటకు చేరుకున్న చంద్రబాబును.... అనుమతి లేదంటూ ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ పోలీసులు సూచించారు. అందుకు ససేమిరా అన్న చంద్రబాబు... ఉదయం 9నుంచి రాత్రి 7గంటల వరకు సుమారు 10గంటలపాటు ఎయిర్‌పోర్ట్‌లోనే నిరసన తెలిపారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా నేలపై కూర్చుని ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్ పంపేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. రేణిగుంట నుంచి హైదరాబాద్ వెళ్లే అన్ని ఫ్లైట్లలో చంద్రబాబు కోసం టికెట్లు బుక్ చేయించి పెట్టారు. అయితే, తాను కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడాకే హైదరాబాద్ తిరిగి వెళ్తానని చంద్రబాబు తెగేసి చెప్పడంతో... చివరికి చిత్తూరు, తిరుపతి ఎస్పీలు రంగంలోకి దిగి గంటన్నరపాటు చర్చలు జరిపారు. అనంతరం, దీక్ష విరమించిన చంద్రబాబు.... రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి ఇండిగో ఫ్లైట్‌లో హైదరాబాద్‌కి బయల్దేరారు.
చంద్రబాబు ఆందోళనతో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో సుమారు 10గంటలపాటు ఉత్కంఠ వాతావరణం కొనసాగింది. చిత్తూరు జిల్లా పర్యటన కోసం హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్న చంద్రబాబును ఎయిర్ పోర్ట్ లోనే పోలీసులు అడ్డుకోవడంతో.... టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగారు. మరోవైపు, పోలీసుల చర్యను నిరసిస్తూ ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనే చంద్రబాబు బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఒకానొక సమయంలో అరెస్ట్‌కు కూడా వెనుకాడబోమంటూ చంద్రబాబుకి నోటీసులు సైతం జారీ చేశారు. ఫోన్లను కూడా పోలీసులు లాక్కున్నారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చంద్రబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును నిర్బంధించారన్న విషయం తెలుసుకున్న ఆయన చెల్లెలు హైమావతి విమానాశ్రయానికి వచ్చారు. చంద్రబాబు సోదరితోపాటు ఆయన మేనకోడలు సచరిత కూడా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. అయితే, అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేశారని చంద్రబాబు చెల్లెలు హైమావతి తెలిపారు.