లోకేష్ బాబుకు చంద్రబాబు, కొత్త దిశానిర్దేశం చేశారా? మొన్నటి వరకు ఒక లెక్కా, ఇక ముందు మరో లెక్కా అంటూ, న్యూ మెసేజ్ ఇచ్చారా? కుప్పం పర్యటనలో అదే విషయన్ని, స్థానిక టీడీపీ నేతలకు చంద్రబాబు వివరించారా? ఇంతకీ ఇరువురికి చంద్రబాబు చేసిన నిర్దేశమేంటి?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సొంత నియోజకవర్గం కుప్పంలో, తాజాగా పర్యటించారు. స్థానిక నాయకులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన చంద్రబాబు, పనిలోపనిగా లోకల్ క్యాడర్‌కు సరికొత్త నిర్దేశం చేశారట. అది విన్న నేతలు ఆశ్చర్యపోయినా, సదా మీ మాటకే కట్టుబడి వుంటామని వాగ్దానం చేశారట.
తనయుడు, మాజీ మంత్రి లోకేష్‌కు సైతం ఇంతకుముందే ఒక దిశానిర్దేశం చేశారట చంద్రబాబు. మంగళిరిలో ఓడిపోయిన లోకేష్‌కు, మంచి నియోజకవర్గాన్ని ఇప్పటికీ వెతుకుతున్నారట బాబు. లోకేష్ సులభంగా గెలవగలిగే స్థానం కోసం సెర్చింగ్ చేస్తున్నారట. రాబోయే కాలంలో కాబోయే పార్టీ అధినేత కాబట్టి, సెక్యూర్డ్ సీటొకటి అప్పగిస్తే, తన బాధ్యత తీరిపోతుందని కూడా తలపోస్తున్న బాబు, ఇందులో భాగంగానే, లోకేష్‌కు ఒక మాట చెప్పారట. కుప్పంలో టీడీపీ నేతలకు, తనయుడు లోకేష్‌కు ఒకే రకమైన మాట చెప్పారట చంద్రబాబు. అదేంటంటే, ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచే లోకేష్ పోటీ చేస్తారట. అదీ విషయం.
ఇదివరకే కుప్పంపై లోకేష్‌తో మాట్లాడిన చంద్రబాబు, తాజాగా స్థానిక నేతలతో ఇదే మాట చెప్పారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇక నుంచి తన బదులు, లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తారని, ప్రతి ఒక్కరూ తనను ఎలా ఆదరించారో, లోకేష్‌నూ సపోర్ట్ చెయ్యాలని చెప్పారట. త్వరలో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. కుప్పంలో టీడీపీ పట్టు ఏమాత్రం సడలకుండా లోకేష్‌ను రంగంలోకి దింపాలని డిసైడయ్యారట బాబు. టీడీపీకి పట్టుకోల్పోకుండా ఉండటమే కాదు, కుప్పంలోనూ లోకేష్‌కూ పట్టు పెరిగేలా స్థానిక ఎన్నికలను మలచుకోవాలని భావిస్తున్నారట. తాను రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేస్తే, లోకేష్ మాత్రం కుప్పం మీదే ఎక్కువ దృష్టిపెట్టి, లోకల్‌గా పట్టు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చెయ్యాలని దిశానిర్దేశం చేశారట.
వాస్తవానికి గత ఎన్నికల్లోనూ కుప్పం నుంచి లోకేష్‌ను బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచన చేశారట. కానీ సర్వేలు మాత్రం కాస్త నెగెటివ్‌గా మారడంతో తానే రంగంలోకి దిగడం మేలని అనుకున్నారట. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తనకు వయసు మరింత మీదపడుతుందని భావిస్తున్న చంద్రబాబు, లోకేష్‌కు కుప్పమైతేనే మేలని ఆలోచించారట. జగన్‌కు పులివెందుల ఎలా తిరుగులేని నియోజకవర్గంగా మారిందో, లోకేష్‌కు సైతం కుప్పం కావాలని భావిస్తున్నారట బాబు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో వీధివీధిలోనూ ప్రచారం చేసి, కుప్పంలో పట్టు పెంచుకోవాలని లోకేష్‌కు చెప్పారట. స్థానిక టీడీపీ నేతలకు సైతం ఇదే విషయం వెల్లడించారట. చూడాలి, నిజంగా చంద్రబాబు కుప్పంను లోకేష్‌కు అప్పగిస్తారో, లేదంటే తనకింకా వయసు అయిపోలేదని మళ్లీ రంగంలోకి దిగుతారో ఒకవేళ కుప్పం నుంచే లోకేష్ పోటీ చేసినా, తండ్రిని ఆదరించినట్టు, కొడుకును ఆదరిస్తారో లేదోనన్నది ఆసక్తి కలిగించే అంశం.