Delhi: ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నేడు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం
Delhi: భేటీ అయిన తర్వాత పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
Delhi: నేడు అమిత్‌షాతో మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇప్పటికే బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి మధ్య పొత్తు కుదిరింది. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో ఒక సీటు అటూఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బహుశా బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయొచ్చని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య ఒకటి అటూఇటుగా సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలపై మూడు పార్టీలూ అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మూడు పార్టీల అగ్రనేతలు శుక్రవారం మరోసారి సమావేశం కావాలనుకున్నా అమిత్ షా, జేపీ నడ్డాలకున్న ముందస్తు కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. దీంతో ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాలపై పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ పొత్తులపై మూడు పార్టీల వారెవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు. భేటీ అయిన తర్వాత దీనిపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.