Amit Shah: నేడు శ్రీశైలానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
Amit Shah: ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు రానున్న అమిత్‌షా * ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలానికి అమిత్‌షా
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరికొన్ని గంటల్లో తెలుగు గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న అమిత్ షా.. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఉదయం 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా అనంతరం ఇక్కడికి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 12.25కు కర్నూలు జిల్లా పరిధిలోని శ్రీశైలంలోని సున్నిపెంటకు అమిత్ షా చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 వరకు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా భోజనం చేయనున్నారు. అనంతరం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలు దేరతారు.. లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన మరుసటిరోజే అమిత్ షా శ్రీశైలం రానుండడం ఆసక్తి రేపుతోంది.
మరోవైపు.. కుటుంబ సభ్యులతో అమిత్ షా పర్యటన సాగనున్న నేపధ్యంలో హోం మంత్రి పర్యటనలో రాజకీయ కలయికలు ఉంటాయా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు శ్రీశైలంలో షాను కలవొచ్చని తెలుస్తోంది. ఇటు అధికార వైసీపీ సైతం హోం మంత్రి మర్యాదలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా వీలైతే కీలక నేతలను పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కేంద్ర హోం మంత్రి పర్యటన సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.