వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు
Election Commission: వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు
Election Commission: వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని.. ప్రజాస్వామ్యంలో పార్టీలో శాశ్వత పదవులు ఉండవని తెలిపింది సీఈసీ.వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలో భాగంగా వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం .. పార్టీలో అంతర్గత విచారణ జరిపి అసలు విషయమేమిటో తెలపాలంటూ లేఖలో పేర్కొంది.
ఈ లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరుగుతూ ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అదే సమయంలో ఏ పార్టీలో అయినా ఓ నేత శాశ్వత అధ్యక్షుడుగా గానీ, ఆ నేతకు శాశ్వత పదవులు గానీ వర్తించవని కూడా స్పష్టం చేసింది. ఏ పార్టీ ఎన్నికలు అయినా ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే జరగాల్సి ఉందని తెలిపింది. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే.. వైసీపీ నిర్ణయం ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు విరుద్ధమేనని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ తరహా నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది.