బైరెడ్డి సిద్దార్థరెడ్డిపై ఎమ్మెల్యే ఆర్థర్ ఎందుకంతగా రగిలిపోతున్నారు.. ఆర్థర్, సిద్దార్థ రెడ్డి మధ్యలో అనిల్?
కర్నూలు జిల్లా వైసీపీలో ఆధిపత్య రాజకీయాలు, అంతకంతకూ రాజుకుంటున్నాయి. ముఖ్యంగా నందికొట్కూరులో ఇద్దరు నాయకుల రచ్చ అంతాఇంతా కాదు. దళిత ఎమ్మెల్యేనైన తనను, యువనాయకుడు ఇబ్బందిపెడుతున్నారని, ఎమ్మెల్యే ఆర్థర్ ఆరోపిస్తుంటే, సిద్దార్థ కౌంటర్ ఇస్తున్నారు. ఇద్దరి కోల్డ్‌వార్ చల్లార్చాలని, మంత్రి అనిల్ ఏదో ప్రయత్నిస్తే, అదికాస్త మరింత భగ్గుమనేలా చేసిందట. దీంతో ఇద్దరి మధ్యా మంత్రి అనిల్ నలిగిపోతున్నారట. అసలు నందికొట్కూరు వైసీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే ఆర్థర్, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉప్పూనిప్పులా ఎందుకు మారారు?
కర్నూలు జిల్లాలో నందికొట్కూరు సెగ్మెంట్, ఇప్పడు వైసీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పిలా మారింది. నేతల మధ్య కీచులాటలతో నియోజకవర్గం పార్టీలో అశాంతి రాజ్యమేలుతోంది. నందికొట్కూరు ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్‌డ్ నియోజకవర్గం. అయితే, బైరెడ్డి, గౌరు వెంకట్ రెడ్డి కుటుంబాల రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఎస్సీ రిజర్వ్డ్ అయినా, తమ పొలిటికల్ దుకాణాన్ని మాత్రం ఇక్కడి నుంచి ఎత్తేయడం లేదన్న విమర్శలున్నాయి. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా, తెర వెనక మాత్రం ఆధిపత్య రాజకీయాలు చేస్తోంది ఈ రెండు కుటుంబాలేనన్న ఆరోపణలున్నాయి. దళిత ఎమ్మెల్యేలను ఉక్కిరిబిక్కిరి చేయడమే, ఈ నాయకుల పనిగా మారిపోయిందన్నది పార్టీలోనే వినిపిస్తున్న మాట. తాజాగా ఎమ్మెల్యే ఆర్థర్‌పై యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డామినేట్ రాజకీయాలు చేస్తున్నారంటూ, నందికొట్కూలో బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.
అయితే గత ఎమ్మెల్యేల మాదిరి ఎవరో ఆధిపత్యానికి తాను మాత్రం తలొగ్గేది లేదని, బైరెడ్డి వర్గానికి తెగేసి చెబుతున్నారట ఎమ్మెల్యే ఆర్థర్. దీంతో బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గం ఆగ్రహంతో రగిలిపోతోందట. ఇఫ్పుడు ఈ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్, ప్రభుత్వ అధికారులకు చుక్కలు చూపిస్తోందట. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అయితే, ఇదే నియోజవర్గం సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. దీంతో తాను చెప్పిందే వినాలని ఎమ్మెల్యే అంటుంటే, తరతరాలుగా నందికొట్కూలో తమ కుటుంబానిదే ఆధిపత్యమని, తాను పలికిందే వేదమన్నట్టుగా నడచుకోవాలని పార్టీ నేతలకే కాదు, ఏకంగా ప్రభుత్వ అధికారులకూ హుకుం జారీ చేస్తున్నారట బైరెడ్డి సిద్దార్థరెడ్డి.
కలిసి పని చేసుకోవాలని, సమన్వయంతో నందికొట్కూరు అభివృద్దికి, పార్టీ ఉన్నతికి తోడ్పడాలని సీఎం జగన్ చెబితే, ఇద్దరు నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతున్నారట. నియోజకవర్గంలో తమ అనుచరులు, కార్యకర్తలకు పదవులు ఇప్పించుకోవడంలో, పనులు చేయించుకోవడంలో పోటాపోటీగా ముందుకు కదులుతున్నారట. అయితే అటు ఎమ్మెల్యే ఇటు నియోజకవర్గ సమన్వయకర్త ఇద్దరిలో ఎవరి మాట వినాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారట.
జిల్లాలోని అధికార పార్టీ నేతలు ఈ సమస్యను స్వయంగా ముఖ్యమంత్రికి విన్నవించడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి, వీరిద్దరికీ సయోధ్య కుదిరించారట. అయినా ఇద్దరిలో ఎటువంటి మార్పు రాలేదు. అయితే నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల కంటే ఎమ్మెల్యేలకే అధికారాలు ఇస్తూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. దీంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు ఆర్థర్ ఆదేశాలనే అధికారికంగా పాటిస్తున్నారు. ఒకరకంగా ఈ పరిణామంతో సిద్దార్థరెడ్డికి చెక్‌పడినట్టయ్యిందని, ఆర్థర్‌వర్గం హ్యాపీగా వుంది. ఈ పరిణామంతో పుండు మీద కారం చల్లినట్టుగా రగిలిపోతోందట సిద్దార్థరెడ్డి బృందం.
దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఒకానొక దశలో పార్టీ మారుతారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే స్వయంగా మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించారు సిద్ధార్థరెడ్డి. అయితే తనకు గాని తన వర్గానికి గాని, ఎటువంటి పనులు చేయలేక పోతున్నామని, కనీసం తమవారికైనా పనులు కేటాయించాలని జిల్లా ఇంఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గర వాపోయారట సిద్దార్థ. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రి అనిల్, మార్కెట్ యార్డ్ చైర్మన్‌లతో పాటు కొన్ని పదవులు కట్టబెట్టేందుకు హామీ ఇచ్చారట.
సిద్దార్థరెడ్డి వర్గానికి మంత్రి అనిల్ హామి, ఇప్పుడు ఎమ్మెల్యే వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందట. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కాదని సమన్వయకర్తకు మంత్రి ఎలా వాగ్డానం ఇస్తారంటూ మండిపడుతున్నారట ఎమ్మెల్యే అనుచర వర్గం. ఇదేగనుక కొనసాగితే తాము జిల్లాలో మంత్రి పర్యటనను అడ్డుకుంటామని తెగేసి చెబుతున్నారట. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తలదూర్చని మంత్రి అనిల్, ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరులోనే ఇంత చొరవ తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారట. ఎస్సీ ఎమ్మెల్యేను ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్న బైరెడ్డి సిద్దార్థరెడ్డికి వత్తాసు పలకడమేంటని రగిలిపోతున్నారట.
మొత్తానికి నందికొట్కూరు మార్కెట్ యార్డ్ తాజా వివాదం జిల్లా ఇన్చార్జి మంత్రి మంత్రికి పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతోంది. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉండటంతో, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నా, వాటిని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తీరు భవిష్యత్తులో ఇబ్బందిగా మారుతుందని టెన్షన్ పడుతున్నాటరట. రానున్న స్థానిక సమరంలో పార్టీకి నష్టం తెచ్చే ప్రమాదముందని భావిస్తున్నారట. వీలైనంత త్వరగా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, సమన్వయకర్త సిధ్దార్థరెడ్డి మధ్య సమన్వయం కుదిర్చితే తప్ప, పార్టీలో అశాంతి సద్దుమణగదని ఆలోచిస్తున్నారట. చూడాలి, మంత్రి అనిల్ ఎలాంటి పరిష్కారం ఆలోచిస్తారో ఇద్దరి మధ్యా సంధి ఎలా కుదుర్చుతారో.