ఏపీలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు
Andhra Pradesh: బీర్ల అమ్మకాల్లోనే 28శాతానికి పెరిగిన వృద్ధి
Andhra Pradesh: ఎండలు మండుతున్నాయి. వేసవితాపం తీర్చుకోడానికి మందుబాబు బీర్లను ఎంచక్కా లాగించేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీలో మద్యం అమ్మకాలు రికార్డుస్థాయిలో సాగుతున్నాయి. దీంతో లాభాలు ఆశాజనకంగా వస్తున్నాయని సమాచారం. వేసవిలో గుంటూరు జిల్లాలో రకరకాల బ్రాండ్లతో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. బ్రాండు ఏదైనా సరే చల్లగా బీర్లను ఇబ్బడి ముబ్బడిగా తాగేస్తున్నారు.
మద్యం అమ్మకాలు ఏపీకి ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొత్త కొత్త బ్రాండ్లు మద్యం బాబుల దప్పిక తీర్చుతున్నాయి. బార్లు, వైన్ షాపుల సంఖ్య తగ్గించినప్పటికీ అమ్మకాలు మాత్రం ఆశాజనకంగా పెరిగాయి. ఉమ్మడి గుంటూరుజిల్లాలో మద్యం అమ్మకాలను గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరిలో 19శాతం, మార్చినెలలో 28, ఏప్రిల్ లో 37 శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి ఏపీలో మద్యం రేట్లను పెంచినప్పటికీ కొనుగోలుచేసే విషయంలో మందుబాబు వెనుకడుగు వేయలేదని అమ్మకాల గణాంకాలు రుజువు చేస్తున్నాయి.