Andhra Pradesh: ఏపీలో బద్వేల్ ఉపఎన్నికకు మోగిన నగారా
Andhra Pradesh: వరుస విజయాలతో ఊపుమీదున్న వైసీపీ
Andhra Pradesh: ఏపీలో బద్వేల్ ఉపఎన్నికకు నగారా మోగడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ కార్యచరణ సిద్ధం చేస్తున్నాయి. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనే రిపీట్ చేయాలని అధికార వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఊపు మీదున్న వైసీపీ.. ఉపఎన్నికలో తమ స్థానాన్ని ఎలాగైనా పదిలం చేసుకోవాలని చూస్తోంది. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి విజయం సాధించిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో ఆయన సతీమణి దాసరి సుధను బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే సీఎం జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ కూడా తమ అభ్యర్థిని గతంలోనే ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వెంకట సుబ్బయ్యపై పోటీ చేసి ఓటమి పాలైన ఓబుళాపురం రాజశేఖర్‌కు మరోసారి చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే. గత అనుభావాల దృష్ట్యా ముందస్తుగానే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. స్థానిక సంస్థల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. పటిష్ట చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు చంద్రబాబు.
ఇక బద్వేల్ ఉపఎన్నిక బరిలో దిగాలని కార్యాచరణ సిద్ధం చేస్తోంది బీజేపీ, జనసేన కూటమి. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దింపగా ఈసారి జనసేనకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్టు సమాచారం. ఇరుపార్టీల నేతలు కలిసి చర్చించాక అభ్యర్థి ఎవరనేదానిపై క్లారిటీ రానుంది. బద్వేల్ సీఎం సొంత జిల్లా కావడంతో ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బీజేపీ,జనసేన పార్టీలు.