టీటీడీ ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదంగా మారుతోందా.. టీటీడీపై ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి?
Tirumala Tirupati Devasthanams: తిరుమల తిరుపతి దేవస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదంగా మారుతోందా ?
Tirumala Tirupati Devasthanams: తిరుమల తిరుపతి దేవస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదంగా మారుతోందా ? పాలక మండలి నిర్ణయాన్ని కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారన్నది తెలీదు కాని సోషల్ మీడియాలో టీటీడీపై ట్రోల్స్ విపరీతమైయ్యాయి. అసలు టీటీడీ తీసుకున్న నిర్ణయాలేంటి ? వివాదాలేంటి ?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల పాలిట కల్పతరువుగా కోరిన కోర్కెలు తీర్చే ఆ శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామి దర్శనం కోసం గంటలు, రోజుల తరబడి క్యూ లైన్లో వేచియుంటారు. అలాంటిది కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి అధికారులు పలు ఆంక్షలు విధించగా రెండేళ్ల తరువాత ఇప్పుడిప్పుడే వాటిని సడలించి దాదాపు 50 వేలకు పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
కొవిడ్ కారణంగా శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ మార్పులు తీసుకొచ్చింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ టోకెన్లు, ప్రజాప్రతినిధుల సిపార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు దాతలను తిరుమలకు అనుమతిస్తుంది. అయితే ఆర్జిత సేవలకు తిరిగి భక్తులను అనుమతించే ముందు వాటి ధరలు పెంచాలని టీటీడీ పాలకమండలిలో ప్రతిపాదన చేయడంతో ఈ నిర్ణయం పలు విమర్శలకు దారి తీసింది. దేవాలయాలపై వ్యాపారం చేస్తున్నారంటూ కొందరు ప్రముఖులు ప్రశ్నించారు. ఉన్నట్టుండి ఆర్జిత సేవల టికెట్ల రేట్లు పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ విమర్శలను టీటీడీ కొట్టిపారేసింది. సిఫార్సు లేఖలపై ఇచ్చే ఆర్జిత సేవలకు మాత్రమే ధరలు పెంచామని సాధారణ భక్తులు బుక్ చేసుకునే ఆదర్శ సేవా టికెట్ల ధరలు పెంచలేదని స్పష్టం చేస్తోంది. అయితే పనిగట్టుకొని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న వాదన ఓ వైపు వినిపిస్తోంది. మరోవైపు భక్తులకు మాత్రం సరైన సమాచారం అందడం లేదన్నది వాస్తవం.