వైఎస్ షర్మిల ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు కూటమికి కొమ్ముకాశారా? ఆమెపై సుంకర పద్మశ్రీ ఆరోపణలేంటి?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా పార్టీలో వార్ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా పార్టీలో వార్ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. షర్మిలకు వ్యతిరేకంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారు.
ఈ ఇద్దరు మహిళా నేతల్లో షర్మిల అప్పటికపుడు తెలంగాణ రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఆంధ్రాకు వచ్చి, ఉన్న ఫళాన పీసీసీ పీఠం అధిరోహిస్తే, సుంకర పద్మశ్రీ చాలా కాలంగా పార్టీలో పనిచేస్తూ రాహుల్ గాంధీతో సహా ఏఐసీసీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
వీరిద్దరి మధ్య ఇపుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరాయి.. సొంత అజెండాల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ను షర్మిలా నిలువునా ముంచారంటూ పద్మశ్రీ చేస్తున్న ఆరోపణలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీలోని అన్ని కమిటీలనూ, కార్యవర్గాన్ని రద్దు చేస్తూ షర్మిల తీసుకున్న నిర్ణయం సంచలన కలిగించింది. అంతేకాకుండా, కార్యవర్గంలో తన వ్యతిరేకవర్గం పార్టీ కార్యాలయంలోకి రాకుండా గదులకు తాళాలు వేయించడం కూడా పీసీసీలో చర్చనీయాంశంగా మారింది.
గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసేన హేమాహేమీల వంటి నాయకులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదనీ, షర్మిల నిరంకుశ వైఖరికీ, అహంభావ ధోరణికి ఇది నిదర్శనమని షర్మిల వ్యతిరేకులు చెబుతున్నారు.
పార్టీ కమిటీలను రద్దు చేసే అధికారం షర్మిలకు లేదన్న సంగతిని వారు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళారు. షర్మిల నిర్ణయంపై వారు కూడా విస్మయం వ్యక్తం చేసినట్టు షర్మిల వ్యతిరేక వర్గం చెబుతోంది. పార్టీ కమిటీలను రద్దు చేసే అధికారం ఏఐసీసీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఏఐసీసీ అధ్యక్షుడికి మాత్రమే ఉండగా షర్మిల ఎలా నిర్ణయం తీసుకుంటారన పద్మశ్రీ వర్గం ప్రశ్నిస్తోంది.
ఇదే విషయాన్ని ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పద్మశ్రీతో పాటు రాకేష్ రెడ్డి తదితరులు వేణుగోపాల్ ను కలిసి ఏపీలో షర్మిల అవలంబిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను వివరించారు. ఈ సందర్భంగా పార్టీ కమిటీలనూ, కార్యవర్గాన్ని రద్దు చేసే అధికారం షర్మిలకు లేదనీ, ఈ విషయమై వివరణ కోరతామని వేణుగోపాల్ చెప్పినట్టు సమాచారం.
షర్మిలా, మాణిక్యం ఠాకూర్ కుమ్మక్కు
షర్మిలతో పాటు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ పై కూడా పద్మశ్రీ, రాకేష్ రెడ్డి తదితరులు ఏఐసీసీ పెద్దలను కలిసి ఆరోపణలు చేశారు. ఇద్దరు కలిసి కుమ్మక్కయి పార్టీని నిలువునా ముంచారు. డబ్బులు తీసుకుని అనామకులకు టిక్కట్లిచ్చారు. లోపాయికారీగా ఎన్డీఏ కూటమితో కుమ్మక్కయ్యారు.
పార్టీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కోసం అధిష్టానం డబ్బులు పంపించగా ఒక్క పైసా కూడా షర్మిల ఇవ్వలేదన్నది వారు చేస్తున్నవ ప్రధాన ఆరోపణ. అంతేకాదు, ఎన్నికల్లో తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మాత్రమే ప్రచారం చేస్తూ సొంత అజెండా కోసం పార్టీని వాడుకున్నారనీ, రాష్ట్రంలో అవసరమైన చోట ఎక్కడా పర్యటించకుండా పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా కూటమికి లబ్ది చేకూర్చారని, షర్మిల ఒంటెద్దు పోకడకు మాణిక్యం ఠాకూర్ కూడా మద్దతిచ్చారని పద్మశ్రీ వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది.
వాళ్లకంత సీను లేదు..
తమ నాయకురాలిపై ఆరోపణలు సంధిస్తున్న వారికి పార్టీలో అంత సీను లేదని షర్మిల వర్గం అంటోంది. పట్టుమని పది ఓట్లు కూడా తీసుకురాలేని వారంతా షర్మిలపై ఆరోపణలు చేస్తున్నారనీ, వారికంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఏఐసీసీ మార్గదర్శకాల మేరకే పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారు..దీనిలో షర్మిల ప్రమేయం ఏమీ లేదు. దీంతో పాటు మిగతా ఆరోపణల్లోనూ పస లేదు. షర్మిల వచ్చిన తరువాతే ఏపీలో కాంగ్రెస్ కు మళ్లీ ఉనికి వచ్చిందని అంటున్నారు.
క్రమశిక్షణ కమిటీ నోటీసులు..ధీటుగా పద్మశ్రీ జవాబు
షర్మిలపై చేస్తున్న ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా పద్మశ్రీ, రాకేష్ రెడ్డి లకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. దీనిపై పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు ధీటుగా సమాధానం చెప్పారు. గత నెల జూన్ 20న పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు షర్మిల ప్రకటించారు.. పార్టీ కమిటీలను రద్దు చేసిన తరువాత క్రమశిక్షణ కమిటీ కూడా రద్దవుతుంది కదా, రద్దయిన క్రమశిక్షణా కమిటీకి నోటీసులు పంపించే అధికారం ఎక్కడుంది? అని వారు ప్రశ్నించారు.
అసలు షర్మిలకు పార్టీ కార్యవర్గాన్ని, కమిటీలను రద్దు చేసే అధికారం ఉందో, లేదో తేల్చాలని పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు డిమాండ్ చేశారు. దీంతో క్రమశిక్షణా కమిటీ ఆలోచనలో పడినట్టు సమాచారం. దీనిపై ఏఐసీసీ నుంచి పూర్తి స్పష్టత వచ్చేంతవరకు పీసీసీలో గొడవలు రోజురోజుకు మరింత పెరిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బెంగుళూరు, ఢిల్లీలో బిజీ
పీసీసీ విబేధాలు రచ్చకెక్కిన వేళ షర్మిల, పద్మశ్రీలు ఏఐసీసీ పెద్దలను కలిసే పనిలో బిజీగా ఉన్నారు. షర్మిల ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టటంలో కీలక భూమిక పోషించిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ను ఇటీవల షర్మిల కలిశారు.
విజయవాడలో నిర్వహించనున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతోనూ భేటీ అయ్యారు. కొన్ని రోజుల ముందే ఢిల్లీ వెళ్లి ఏసీసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా, రాహుల్ ను కూడా కలిసి ఏపీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరో వైపు సుంకర పద్మశ్రీ కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి ఏపీలో పార్టీ పరిస్థితి గురించి సూచన ప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. బెంగుళూరులో శివకుమార్ తోనూ భేటీ అయి పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేస్తూ షర్మిల తీసుకున్న నిర్ణయం, తదినంతర పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది.
మొత్తానికి, ఏపీ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. పార్టీ ఆఫీసులో ఒక వర్గానికి చెందిన గదులకు తాళాలు వేసే వరకూ పరిస్థితి వెళ్ళింది. కాంగ్రెస్ దిల్లీ పెద్దలు రంగంలోకి దిగితే కానీ ఇది సద్దుమణిగేలా కనిపించడం లేదు.