AP High Court: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు బ్రేక్
AP High Court: రేపు జరగాల్సిన పరిషత్ ఎన్నికల పోలింగ్‌ను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ
AP High Court: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు బ్రేకులు వేసింది. రేపు జరగాల్సిన పరిషత్ ఎన్నికల పోలింగ్‌ను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఎస్‌ఈసీ నీలం సాహ్ని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాక హైకోర్టు జోక్యం సరికాదని పేర్కొంది ఎన్నికల కమిషన్. ఇక కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు ఆటంకం కాకూడదంటే త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొంది ఎస్ఈసీ. ఎస్‌ఈసీ హౌస్‌మోషన్ పిటిషన్‌పై ఇవాళ విచారించే అవకాశం ఉంది.
పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ టీడీపీ నేత హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును పక్కనపెడుతూ ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేసేలా రీ-నోటిఫికేషన్ జారీ చేసి, ఆ విషయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించారు. ఈ నెల 1న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్, తదనంతర చర్యలపై హైకోర్టు స్టే విధించింది.