Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
*ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు ఆమోదం *2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏ విడుదల
Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన షెడ్యుల్‌కు అనుగుణంగా 2022 జనవరి నుంచి పెంచిన డీఏని జీతానికి జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన డీఏని చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు, మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నట్లు తెలిపింది. జడ్పీ, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, అన్ని ఎయిడ్‌డ్ సంస్థలు, విశ్వవిద్యాలయాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా డీఏ పెంపు వర్తిస్తుందని ఆర్థికశాఖ వెల్లడించింది.