ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ రద్దు.. ఇద్దరు ఎస్పీల స్థానంలో వీరే..

Update: 2019-03-28 01:13 GMT

ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తున్నట్లు మంగళవారం జీవో (నంబర్‌ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నం బరు 720 జారీ చేసింది. అంతేకాదు కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఇప్పటికే ఏపీ సర్కార్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో తాము కూడా జోక్యం చేసుకుంటామని వైసీపీ కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ నిర్ణయం వెలువడనుంది.

మరోవైపు శ్రీకాకుళం, కడప జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఎస్పీలను నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ను, కడప జిల్లాకు అభిషేక్‌ మహంతిని ఎస్పీలుగా నియమిస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌ 2008 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. గతంలో విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం నిఘా విభాగంలో ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. అభిషేక్‌ మహంతి 2011 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ కడప ఎస్పీగా పనిచేశారు. తర్వాత గ్రేహౌండ్స్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు. శ్రీకాకుళం, కడప ఎస్పీలుగా ఉన్న అడ్డాల వెంకటరత్నం, రాహుల్‌దేవ్‌ శర్మలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. 

Similar News