AP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
AP Employees: పాత పింఛను విధానమే కావాలి
AP Employees: ఏపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేమని.. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమల్లోకి తేవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు తెగేసి చెప్పాయి. ఓపీఎస్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే.. సెప్టెంబరు 1న తలపెట్టిన ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి, విజయవాడలో మిలియన్ మార్చ్.. బహిరంగ సభ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.
సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎవరి వాదనకు వారు కట్టుబడటంతో ప్రతిష్టంభన వీడలేదు. ప్రభుత్వం నియమించిన కమిటీలో మరో సభ్యుడు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశానికి హాజరవలేదు. అయితే ఆయనతో మాట్లాడాక, మరోసారి చర్చలకు పిలుస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రి బొత్స తెలిపారు.
ఇక జీపీఎస్ అంశంపై చర్చించేందుకైతే తాము రాబోమని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఇక సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలన్నీ సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని తేల్చిచెప్పాయి.