సుదీర్ఘ రాజకీయచరిత్ర ఉన్న ఆ పార్టీకి, ఇప్పుడు భవిష్యత్ పై బెంగపట్టుకుందట. ఆ పార్టీలో ఉన్న తమకు ఎప్పటికైనా మంచి రోజులొస్తాయేమోనని ఎదురు చూస్తున్న నేతలకు, తమ తలరాతేంటో ఇప్పుడు అస్సలు అర్ధం కావటం లేదట. చిరకాల ప్రత్యర్ధి ఓవైపు దూసుకుపోతోంటే కనీసం రేసులో కూడా తాము నిలబడలేకపోతున్నామన్న ఆవేదన వారిని తొలచివేస్తోందట. అసలు ఆ పార్టీ ఏంటి...? ఈ దూసుకుపోతోన్న ప్రత్యర్ధి ఎవరు...?
134 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఉన్న పార్టీ కాంగ్రెస్. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్ అంటే చాలా మందికి ఇష్టం, మరికొంతమందికి ప్రాణం. అధికారంలో ఉన్నా లేకపోయినా తనదైన ఓటుబ్యాంకు కలిగి ఉండే ఈ పార్టీ, ఇప్పుడు ఏపీలో నామరూపాల్లేకుండా పోయింది. విభజన దెబ్బకు కుదేలై పొలిటికల్ రేసులో అసలు ఊసులోనే లేకుండా నామమాత్రంగా తయారైంది. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లూ, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్లు సైతం విభజన దెబ్బకు సైలెంటయ్యారు. కొంతమంది నేతలు ముందు చూపుతో పార్టీ వీడి టిడిపి, వైసీపీల కండువాలు కప్పుకోగా అలా వెళ్లలేని వాళ్లూ, వెళ్దామనుకున్నా బెర్తులు ఖాళీ లేని వాళ్లు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండీ లేనట్లుగా ఏదో మమ అంటూ మొహమాటానికి నడిపించేస్తున్నారు.
దీంతో పార్టీని ముందుండి నడిపించే నాయకులే కరువవ్వడంతో పార్టీ శ్రేణులు ఢీలా పడుతున్నాయి. విభజన జరిగి 6 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, పార్టీ భవిష్యత్తుకు విభజన దెబ్బ ఇంకా అడ్డంకిగా మారటం, ఇన్నేళ్లు గడుస్తున్నా జనంలోకి ధైర్యంగ వెళ్లలేకపోవటం నాయకత్వలోపంగానే ద్వితీయశ్రేణి నాయకులు భావిస్తున్నారు. రఘువీరారెడ్డి మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కాడి పారేయగా..ఆ తర్వాత ముచ్చటగా ముగ్గురు అధ్యక్షుల్ని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. సారథిగా శైలజానాధ్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, తులసిరెడ్డిలను ఎంపిక చేసినప్పటికీ, వీరు సగటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయటంలో అంతంతమాత్రంగానే పనితీరును కనబరుస్తున్నారు. దీంతో ముగ్గురొచ్చినా ముందుకు అడుగులు పడకపోవటంతో తత్తరపడుతున్న కార్యకర్తలు తమ చేత జెండా పట్టించే నాయకుడి కోసం బిత్తరచూపులు చూస్తున్నారు.
అయితే రాష్ట్ర నాయకత్వం డల్ గా ఉంటే, సహజంగా కేంద్ర నాయకత్వం అనేది దృష్టి పెట్టడం కామన్. కానీ పాపం ట్రాజెడీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రనాయకత్వానికే దిశానిర్దేశం ఉన్నట్లుగా తాజా రాజకీయపరిస్థితులు కనిపించటం లేదు. సొంతపార్టీకి చెందిన సీనియర్లే లేఖాస్త్రాలను సంధించి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో, ఇక ఏపీలో ఏవో అద్భుతాలు జరుగుతాయని వాళ్లు భావించటం లేదు. ఉమెన్ చాందీ లాంటి సీనియర్ లీడర్ ను పార్టీ ఇంచార్జిగా కొనసాగింపు జరిగినప్పటికీ, ఇక్కడ పార్టీని పైకి లేపేందుకు ఆయన శక్తి సామర్ధ్యాలు ఏమాత్రం సరిపోవటం లేదన్నది పార్టీ అంతర్గత వర్గాల మాట. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర భవిష్యత్ పై ముఖ్యనేతలందరూ భేటీ కాబోతున్నారని తెలుసుకున్న నేతలు, మార్పు వచ్చిందోచ్ అని అనుకున్నంతలోనే వారి ఉత్సాహంపై భారీ వర్షం కురిసినట్లుగా ఏపీ భవిష్యత్ కు సంబంధించిన సమావేశాన్ని ఇటీవలే హైదరాబాద్ లో పెట్టుకోవటంపై ఇదేం తీరురా బాబూ అంటూ తలపట్టుకోవటం పార్టీ శ్రేణుల వంతయింది. ఈ పెద్దోళ్లున్నారే అన్న సినిమా డైలాగ్ మాదిరిగా మా పెద్దోళ్లు ఉన్నారే వీళ్లు మారరు, పార్టీ పరిస్థితి మారదని సగటు కాంగ్రెస్ అభిమాని గట్టిగా ఫిక్సయ్యాడట.
మొత్తంగా పార్టీ పుంజుకుంటే తమకు సైతం జనాల్లో కాస్తయినా గుర్తింపు వస్తుందని భావిస్తోన్న కాంగ్రెస్ కార్యకర్తల అంచనాలను, ఆ పార్టీ నాయకత్వం ఏమాత్రం అందుకోలేక పోతోందన్నది నిఖార్సైన నిజం. ఓవైపు చిరకాల ప్రత్యర్ధి బీజేపీ, బర్నింగ్ ఇష్యూస్ పై పోరాడుతూ పొలిటికల్ మైలేజీని తెచ్చుకుంటుంటే మనమేంటి ఇలా ఉన్నామన్న అంతర్మథనం సగటు కార్యకర్తల్లో కనిపిస్తోందట. రాష్ట్ర విభజనతో నష్టపోయాం, కానీ కోలుకునేందుకు తిరిగి జవసత్వాలు కూడగట్టుకునేందుకు రాష్ట్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిణామాల్ని ఉపయోగించుకోవాల్సిన పెద్దలు, బెజవాడలో బూజు పడుతోన్న కార్యాలయాన్ని వదిలేసి హైదరాబాద్ పై ఇంకా మోజును వదలల్లేకపోతున్నారని గుసగుసలాడుకుంటున్నారట. చివరగా మిర్చి సినిమాలో బ్రహ్మానందం డైలాగును గుర్తు చేసుకుంటూ, రానూ పోనూ ఖర్చులు చూసుకున్నారా...? లేక భాగ్యనగరాన్ని వదలి ఏపీలో క్షేత్రస్థాయిలో అడుగుపెట్టలేకపోతున్నారా..? అంటూ తమ నేతల తీరు చూసి అంతర్గతంగా సెటైర్లు సైతం వేసుకుంటున్నారట. మరి కార్యకర్తల ఫీలింగ్స్ ఈ పెద్దలకు వినబడుతున్నాయో లేదో ఇప్పటికైనా ఏపీ పొలిటికల్ రేసులో నిలబడాలంటే కాంగ్రెసు పార్టీ పెద్దలు చెయ్యాల్సింది చాలా ఉందని మనకు కనబడుతోంది. మరి ఓ అధిష్టానమా....? మీకు అర్ధమవుతోందా.....?