YS Jagan - Gajendra Singh Shekhawat: నేడు షెకావత్‌తో కలిసి జగన్ పోలవరం పనుల పరిశీలన
YS Jagan - Gajendra Singh Shekhawat: నిర్వాసితులతో మాట్లాడనున్న కేంద్ర మంత్రి, ఏపీ సీఎం...
YS Jagan - Gajendra Singh Shekhawat: నేడు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో కలిసి పరిశీలించనున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో స్పిల్ వే, ఫిష్ ల్యాడర్, కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ ప్రాంతాలను పరిశీలించనున్నారు.
ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆతర్వాత 11గంటల 20నిమిషాలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
జలాశయం, అనుసంధానాల పనులు 80.6శాతం, కుడి కాలువ పనులు 92.57శాతం, ఎడవ కాలువ పనులు 71.11శాతం పూర్తయ్యాయి. నిర్వాసితులకు పునరావాస కల్పన పనులు 20.19శాతం పూర్తయ్యాయి. పునరావాసం, భూసేకరణ, జలాశయం, కుడి, ఎడమ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు మొత్తంగా చూస్తే 42.68శాతం పనులు పూర్తయ్యాయి.
సీడబ్ల్యూసీ, ఆర్‌సీసీ ఆమోదించిన మేరకు 2017-18 ధరల ప్రకారం పోలవరానికి కేంద్రం నిధులిస్తే ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019 జూన్ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వేలో మిగతా ఆరు గేట్ల బిగింపు పనులకు శ్రీకారం చుట్టింది. గతేడాది ఎగువ కాఫర్ డ్యామ్ ను పూర్తి చేసింది. జూన్ 11న గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా 6.6కిమీ పొడవున మళ్లించింది. జలవిద్యుత్ కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించడమే ఆలస్యం కాగా.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ను పూర్తి చేసి సమాంతరంగా జలవిద్యుత్ కేంద్రం పనుల పూర్తి దిశగా అడుగులు వేస్తోంది.