Andhra Pradesh: సీఎం జగన్ రచ్చబండకు ముహూర్తం ఫిక్స్
Andhra Pradesh: రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు.
Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్సైంది. గతేడాదే ప్రారంభించాలనుకున్నా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఈ ఉగాది నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని దాదాపు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రచ్చబండ పేరుతో నేరుగా ప్రజల్లోకి వెళ్లనున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి, సంక్షేమ పథకాల అమలు తీరుపై అక్కడికక్కడే సమీక్షించనున్నారు. అర్హులందరికీ పథకాలు అందుతున్నాయోలేదో ప్రజలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ పాలనను మరింత దగ్గరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పర్యటనలకు సిద్ధమవుతోన్న జగన్మోహన్‌రెడ్డి రచ్చబండ కార్యక్రమం కోసం సీఎంవో అధికారులు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలు తీరు ఎలాగుంది? అర్హులందరికీ పథకాలు అందుతున్నాయా? లేదా? ఒకవేళ అర్హులకు పథకాలు అందకపోతే కారణాలేంటి? ముఖ్యంగా మహిళల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతున్నాయా? లేదా? అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, వాహనమిత్ర, జగన్న భరోసా లాంటి పథకాలపై నేరుగా ప్రజలతోనే మాట్లాడనున్నారు సీఎం జగన్(Jagan). రచ్చబండ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిపెట్టిన వైసీపీ ప్రభుత్వం, పథకాల అమలులో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది.