YS Jagan: పార్టీపై ఫోకస్ పెంచిన సీఎం జగన్.. నేడు కీలక ప్రకటన...
YS Jagan: పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ...
YS Jagan: 2024 ఎన్నికలపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియామకమైన మాజీ మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లతో ఇవాళ జగన్ భేటీ కానున్నారు. పార్టీ పటిష్ఠతపై గ్రౌండ్ లెవెల్‌లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో పలువురు నేతల అసంతృప్తిపై చర్చించున్నట్టు తెలుస్తోంది. పలు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఉన్న నేపథ్యంలో.. సఖ్యతగా ఉంచడం, పార్టీ బలోపేతంపై చర్చించున్నట్టు తెలుస్తోంది.
వచ్చే నెల నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అప్పటి నుంచి పార్టీని పూర్తిగా యాక్టివ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. వైసీపీ అధికారం చేపట్టాక ఆ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు వైసీపీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం తీప్పికొట్టాలని నేతలకు సూచించనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలని నేతలకు చెప్పనున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
పార్టీలో బాధ్యతలు అప్పగించిన నేతలందరితోనూ ఈ సమావేశం నిర్వహిస్తుండడంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సారి దిశా నిర్దేశం మాత్రమే కాకుండా.. బాధ్యతలు ఫిక్స్ చేయనున్నారు. రీజినల్-జిల్లా అధ్యక్షులుగా నియోజకవర్గాల వారీగా గెలుపు టార్గెట్ నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇకపై ఎవరైనా గీత దాటితే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.