Chandrababu: ఐదేళ్లలో ఏపీ అభివృద్ధికి కృషి చేస్తాం.. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడలన్నదే మా విధానం
Chandrababu Naidu: ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. కేంద్రంలో మంత్రి పదవుల పట్ల సంతృప్తితో ఉన్నామన్నారు. ఎన్డీయే ఇచ్చిన ఆఫర్‌ను కాదనకుండా కేంద్రమంత్రి పదవులు తీసుకున్నామన్నా ఆయన వాజ్‌పేయి హయాంలోనూ ఏడు పదవులు ఇస్తామన్నా కూడా ఒక స్పీకర్ పదవినే తీసుకున్నట్లు తెలిపారు. ఎన్డీఏ పార్టీలతో సత్సంబంధాల కోసమే గతంలో స్పీకర్ పదవిని అంగీకరించినట్లు తెలిపారు.
ఇప్పుడు కూడా అదే తరహాలో ఎలాంటి పదవులు టీడీపీ నుంచి కోరలేదని, ఎన్డీయే నుంచి వచ్చిన ఆఫర్‌ను కాదనకుండా రెండు మంత్రి పదవులు తీసుకున్నామన్నారు చంద్రబాబు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయన్నారు చంద్రబాబు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఏపీ అనుసంధానమై ఉందని, ఒక్క గోదావరి నుంచే సుమారు 3 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందన్నారు. ఆ నీటిని వినియోగించుకోగలిగితే ఏపీలో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. నదుల అనుసంధానం పూర్తిస్థాయిలో చేయగలిగితే గోదావరి నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నింటీకి నీటిని సరఫరా చేయొచ్చని తెలిపారు చంద్రబాబు.
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడలన్నదే తమ విధానమంటూ మాట్లాడారు. ఇరు రాష్ట్రాలకు సమ న్యాయం చేయాలని విభజన సమయంలో కూడా చెప్పానని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశంలోనూ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కారం దిశగానే చర్చిస్తామని స్పష్టం చేశారు.