త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ.. ఇప్పటికే లిస్ట్‌ను సీఎం జగన్ ఫైనల్ చేశారా?

AP Cabinet Expansion: మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులు

Update: 2022-03-13 04:15 GMT

త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ.. ఇప్పటికే లిస్ట్‌ను సీఎం జగన్ ఫైనల్ చేశారా?

AP Cabinet Expansion: త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుదని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఆశావాహులు అలర్ట్ అయ్యారు. ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో పార్టీ పట్టుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు వైసీపీ నేతలు. మంత్రివర్గంలో ఎవరికి చోటు ఉంటుంది..? ఎవరి పేరు జాబితా నుంచి తొలగిస్తారనే చర్చ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో హాట్ టాపిప్ అయ్యింది. ఇద్దరు సిట్టింగుల్లో ఒక్కరు గ్యారంటీగా మారుతారన్న ప్రచారం జరుగుతుండగా ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తుండగా ఇదే జిల్లా నుంచి నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. క్యాబినెట్ మార్పుల్లో ఐదారుగురు మినహా అందరూ మారొచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో చిత్తూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీ వ్యవహారాలలో, ప్రభుత్వ వ్యవహారాలలోనూ ఆయన కుమారుడు కీలక భూమిక పోషిస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో పెద్దిరెడ్డి పార్టీకి పెద్దదిక్కుగానూ వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తరువాత ఆయనే ఇక్కడ కీలకం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానం పదిలం అన్న చర్చ జరుగుతోంది.

ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డికి విధేయుడే అయినా విధిలేక పోవడంతో ఆయన పదవి ఊడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది నెలల క్రితమే ఆయన చేతిలోని వాణిజ్య పన్నుల విభాగాన్ని తీసేసి వేరే మంత్రికి కట్టబెట్టడంతోనే ఓ క్లారిటీ వచ్చిందనే ప్రచారం సాగుతోంది‌. ఇక పదవులు ఆశించే వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డిలు ప్రయత్నాలు చేస్తుండగా క్యాస్ట్ ఈక్వేషన్‌లో బీసీకి అయితే తనకేనంటూ పలమనేరు ఎమ్మెల్యే వెంకటె గౌడ, ఎస్సీకైతే తనకేనంటూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఉన్నది నేనొక్కడే కదా అన్న థీమాలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు లెక్కలేసుకుంటున్నారు.

కొత్త క్యాబినెట్ కూర్పు చేసేలోపు కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయి. అలా జరిగితే జిల్లాలు యూనిట్ గా తీసుకుని బాలాజీ జిల్లా నుంచి చెవిరెడ్డికిగానీ కరుణాకర్ రెడ్డికి గానీ పదవి కట్టబెట్టే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు చిత్తూరు జిల్లాలో మిగిలిపోతుండటంతో అక్కడా ఆయనకు లైన్ క్లియర్ గా రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. రోజాకు మహిళా కోటాలో లైన్ క్లియర్ చేస్తారా అని ప్రచారం జరుగుతోంది. కానీ ఒకే ప్రాంతం నుంచి ముగ్గురు ఒకే సామాజిక వర్గం వారు మంత్రులుగా రావడం అసాధ్యమన్న విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో ఏ లెక్కన ఆశావాహులకు పదవులు దక్కుతుందో ఆ చిక్కుముడిని జగన్ ఎలా ఒప్పించి విప్పబోతాడన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News