AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly: ఉదయం 9గంటలకు అసెంబ్లీ ప్రారంభం
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల తరువాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతోన్న వేళ.. సవరించిన మూడు రాజధాని బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వంలోని మంత్రులు పదే పదె ప్రస్తావించడంతో అసెంబ్లీ సమావేశలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. పలు కీలక అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ, కొన్ని వ్యవస్థలు చేస్తున్న దుష్ప్రచారాన్ని చట్టసభల వేదికగా తిప్పికొట్టాలని సర్కార్ సిద్ధం అవుతున్న వేళ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ సమావేశాలను వేదికగా మార్చుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.
ఇక ఈరోజు ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. శనివారం, ఆదివారం సమావేశాలకు సెలవు ఉంటుంది. తిరిగి సోమవారం నుంచి బుధవారం వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులపై కొత్త బిల్లును ప్రవేశపెట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సమావేశాల తొలి రోజే ప్రభుత్వం మూడు రాజధానులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను పెట్టేందుకు సిద్ధమవుతుంది. అలాగే మూడు రాజధానులపై సభలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉందని వస్తోన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అధికార వికేంద్రీకరణ పేరిట రాష్ట్రంలో మూడు రాజధానులుండాలనే లక్ష్యంతో బిల్లును ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆ బిల్లును ఉపసంహరించుకొని బిల్లులోని లోటుపాట్లను సవరించి త్వరలో బిల్లు ప్రవేశపెట్టెందుకు కసరత్తు చేస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ.. ప్రభుత్వం వైపు నుంచి అలాంటి సంకేతాలు వెలువడుతున్నాయి.
మరోవైపు ఈ సమావేశంలో ప్రతిపక్ష టీడీపీ ఏపీకి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ పట్టుబట్టే అవకాశం ఉంది. దీంతో అధికారపక్షంతో మాటల యుద్ధం కొనసాగే అవకాశాలున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేయడంతో ఈసారి కూడా సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. దీంతో అసెంబ్లీలో లేవనెత్తాల్సిన ప్రధాన అంశాలపై TDLP సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. అమరావతి రాజధాని అంశమే టీడీపీ ప్రధాన ఎజెండాగా అధికార పార్టీపై విరుచుకుపడనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో 15 అంశాలు లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అలాగే, అమరావతిలో అక్రమాలంటూ సీఐడీ తాజా అరెస్టులు పైనా టీడీఎల్పీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో బాధితులకు చేయూతనందించడంలో ప్రభుత్వ వైఫల్యం, పోలవరం ప్రాజెక్టు వరదలు, పులిచింతల గేటు కొట్టుకుపోవడం, రాష్ట్రంలో మద్యపాన నిషేదం, నిరుద్యోగం, అప్పులు, టిడ్కో ఇళ్ల పంపిణీ, గృహ నిర్మాణం తదితర అంశాలపై చర్చించాలని టీడీపీ నాయకులు పట్టుబట్టే అవకాశం ఉంది. దళితులు, మైనార్టీలపై దాడులు, రాష్ట్రంలో క్షీణించిన శాంత్రి భద్రతలు తదితర అంశాలపై చర్చకు పట్టు పట్టాలని టీడీపీ భావిస్తోంది. బాక్సైట్ అక్రమ మైనింగ్, మద్యం కుంభకోణం, నిత్యావసర ధరల పెరుగుదల, అమరావతి నిర్మాణాల్లో నిర్లక్ష్యం అంశాలపైనా ప్రస్తావన తీసుకురానుందని సమాచారం. అస్తవ్యస్తంగా రహదారులు, లేపాక్షి భూములు, విభజన హామీల అమలు, పంచాయితీల నిధుల మళ్లింపు అంశాలపై ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది.
మరోవైపు ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పగడ్బందీ ప్రణాళికలతో అధికార పక్షం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా పోలవరంపై గత ప్రభుత్వ వైఫల్యాలను చట్టసభల వేదికగా బహిర్గతం చేయడంతోపాటు వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుపై తీసుకుంటున్న చర్యల గురించి అసెంబ్లీలో చర్చించి, ప్రతిపక్షానికి గట్టి కౌంటర్ ఇచ్చేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో సమావేశాలు నిర్వహిస్తుండడంతో అందరి దృష్టీ అసెంబ్లీ సమావేశాల పైనే ఉంది. ఈ సమావేశాలతో జగన్ కొత్త కాబినెట్ టీం పవర్ ఏంటో తెలియనుంది. ఈ సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు దూరంగా ఉంటోన్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ వైఫల్యాలను ఎలా ఎండగడతారో అనే అంశంపై కూడా ఆసక్తి నెల కొంది.