రెండోసారి కరోనా సోకి ప్రభుత్వ వైద్యుడు మృతి

ఉన్నత ఆశయాలతో రెండేళ్ల క్రితం వైద్య వృత్తిలోకి వచ్చాడు. కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వాస్పత్రిలో చిన్నపిల్లల వైద్యుడిగా విధులు నిర్వర్తించాడు. తక్కువ సమయంలోనే విలువైన సేవలందించి, శభాష్ అనిపించుకున్నాడు.

Update: 2020-11-09 15:38 GMT

ఉన్నత ఆశయాలతో రెండేళ్ల క్రితం వైద్య వృత్తిలోకి వచ్చాడు. కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వాస్పత్రిలో చిన్నపిల్లల వైద్యుడిగా విధులు నిర్వర్తించాడు. తక్కువ సమయంలోనే విలువైన సేవలందించి, శభాష్ అనిపించుకున్నాడు.ఇంతలోనే కరోనా భూతం ఆ యువ డాక్టర్‌ని వెంటాడింది. ఎందరి ప్రాణాలనో రక్షించిన ఆ వైద్యుడి ప్రాణాలను మాయదారి వైరస్ బలితీసుకుంది.

కడప జిల్లాలోని బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ నందకుమార్‌ చిన్న పిల్లల వైద్యుడుగా రెండేళ్లుగా సేవలందిస్తున్నాడు. అయితే మూడు నెలల క్రితం ఈ వైద్యుడు కరోనా బారినపడ్డారు. గుంటూరులోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కొవిడ్‌ను జయించారు. యథావిధిగా డ్యూటీలో జాయిన్ అయ్యారు.

మళ్లీ 15 రోజుల క్రితం జ్వరం అటాకయ్యింది. పరీక్ష చేయించుకోగా మరోసారి పాజిటివ్‌ అని తేలింది. ఎంతకు తగ్గకపోవడంతో కడప రిమ్స్‌కు వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు తిరుపతి స్విమ్స్‌కు తీసుకువెళ్లారు. చివరకు నందకుమార్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

నందకుమార్ చనిపోగానే వారి కుటుంబం గుండెలవిసేలా రోధించింది. డాక్టర్ గా ఉన్నత పదవులు పొందాల్సిన కొడుకు చనిపోవడంతో ఆయన తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇక బద్వేల్ అస్పత్రి సిబ్బంది, తోటి ఉద్యోగులు కూడా నందకుమార్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కరోనా విషయంలో అందరు జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని బద్వేల్ ఆస్పత్రి వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. 

Tags:    

Similar News