AP Junior Doctors: నేటి నుండి జూనియర్ డాక్టర్ల సమ్మె
AP Junior Doctors: తమ డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం విఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు.
AP Junior Doctors: తెలంగాణలో కరోనా సమయంలో ఆందోళనకు దిగి జూనియర్ డాక్టర్లు ఇక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హామీల వరకు సాధించుకున్నారు. బహుశా ఇదే స్ఫూర్తి అనుకుంట.. ఏపీలోని జూనియర్ డాక్టర్లు కూడా సమ్మెకు దిగుతున్నారు. నెల రోజుల నుంచే వినతి పత్రాలతో మొదలెట్టిన ప్రిపరేషన్.. నేడు సమ్మెతో పతాక స్థాయికి చేరుకుంది.
తమ డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం విఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. దీంతో బుధవారం నుంచి ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. గత నెల రోజులుగా జూనియర్ వైద్యులు ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు ప్రభుత్వానికి సమర్పిస్తూ వస్తున్నారు. కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తున్న తమకు ఇన్సెంటివ్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు నష్ట పరిహారం, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులకు భద్రత, స్టయిపెండ్ నుంచి టీడీఎస్ కోత లేకుండా చేయాలని జూనియర్ వైద్యులకు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్యలన్నీ జూన్ 9 నాటికి పరిష్కరించాలని గతంలో ఆరోగ్యశాఖ అధికారులతో జరిగిన చర్చల్లో తేల్చిచెప్పారు. తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో సాధారణ వైద్య సేవలకు సంబంధించి విధులు బహిష్కరిస్తామని సమ్మె నోటీసులో పేర్కొన్నారు. బుధవారంతో ఆ గడువు పూర్తవుతుంది. దీంతో బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు ఆరోగ్యశాఖ ఆహ్వానించింది. ఆరోగ్యమంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు చర్చలు జరపనున్నారు.