అమరావతి రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు.. ఆ కేసులు కొట్టివేత!

Update: 2021-01-20 09:25 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట (ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి రైతులకు అనుకూలంగా సంచలన తీర్పు ఇచ్చింది. అమరావతి రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. తమ పై పెట్టిన అట్రాసిటీ కేసులను ఎత్తివేయాలని రైతులు కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై రైతుల తరఫున లాయర్ వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ నిర్ణయం వెల్లడించింది. అట్రాసిటీ సెక్షన్లను తొలగించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు కృష్ణాయపాలెంలోని 11 మంది రైతులపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

ఏమిటీ కేసు?

అమరావతి ప్రాంతంలో కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానులు వద్దని.. అమరావతిలోనే రాజధాని ఉండాలని అక్కడి రైతులు కొందరు ఆందోళన చేస్తూవస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో మూడురాజధనులకు మద్దతుగా కొంతమంది నిరసన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పల్గోవడానికి కొంతమంది ఆటోలలో వెళుతుండగా కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే రోజు రాత్రి గొడవ జరుగుతుంటే సర్దిచెప్పడానికి వెళ్లిన తనను రైతులు బెదిరించారంటూ మంగళగిరి మండల వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఈపూరి రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 11 మందిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ చట్టం సహా, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తరువాత రైతుల్ని అరెస్టు చేసిన పోలీసులు వారి చేతులకు సంకెళ్ళు వేసి ముందు నరసరావుపేట సబ్‌జైలుకు, అక్కడినుంచి మంగళవారం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అరెస్టయిన ఏడుగురిలో ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు బీసీలు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టడం, పైగా బేడీలు వేసి తీసుకురావడంతో ఎస్సీ సంఘాలు, రైతుసంఘాలు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తర్వాత రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Tags:    

Similar News