AP Rains: ఏపీకీ ఐఎండీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మూడు రోజులుగా వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. అయితే నేడు కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంటుందని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది. అయితే వర్షం కారణంగా వరదలు ఇంకా కొనసాగుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదలు లోతట్టు ప్రాంతాల్లోకి రావడంతో కాలనీలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా విజయవాడలో చరిత్రలో ఏనాడు ఎరుగని విధంగా వర్షం పడటంతో..అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది.
Heavy Rains In Telugu States: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఈ వాయుగుండం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి పది కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది. ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చిన తర్వాత 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో దక్షిణ ఛత్తీస్ గఢ్, విదర్భ వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనం బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే రుతుపవన ధ్రోణి వాయుగుండం కేంద్రం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సోమవారంకూడా మత్య్సకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
అంతేకాదు గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని..అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెబుతోంది. కళింగపట్నం, విశఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు జారీ చేసిన మూడో నెంబర్ హెచ్చరికలను వెనక్కు తీసుకుంది వాతావరణశాఖ.
నేడు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు ప్రకాశం బ్యారేజీ ప్రస్తుతం ఇన్ ఔట్ ఫ్లో 10,25,776 క్యూసెక్కులు కాగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం 11 లక్షల క్యూసెక్కుల వరకు చేరే ఛాన్స్ ఉంది. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విజయవాడను అతి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాలతో పాటుగా బుడమేర పొంగడంతో నగరవాసులు వణికిపోయారు. శనివారం అర్థరాత్రి నుంచి బుడమేరుకు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారంతెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
సీఎం చంద్రబాబు అక్కడే మకాం వేశారు. బాధితులకు అవసరమైన ఆహారాన్ని అందజేయాలని సూచించారు. విజయవాడలో పరిస్థితులన్నీ చక్కబడే వరకు అక్కడే ఉంటానని సీఎం తెలిపారు.