ఆంధ్రప్రదేశ్: తాకట్టులో ఉన్న విశాఖపట్నం ప్రభుత్వ ఆస్తులివే..
Visakhapatnam govt Properties Pledged: తహసిల్దార్ ఆఫీసు తాకట్టు.. రైతు బజార్ తాకట్టు.. పాలిటెక్నిక్ కాలేజీ తాకట్టు.. ఇవేనా, ఇంకా చాలా ఉన్నాయండి..!
Visakhapatnam govt Properties Pledged: తహసిల్దార్ ఆఫీసు తాకట్టు.. రైతు బజార్ తాకట్టు.. పాలిటెక్నిక్ కాలేజీ తాకట్టు.. ఇవేనా, ఇంకా చాలా ఉన్నాయండి..! ఇంతకీ ఎక్కడ తాకట్టు పెట్టారు.. ఎవరు తాకట్టు పెట్టారు..ఎందుకు తాకట్టు పెట్టారు అనే డౌటు వస్తుంది కదూ..! తాకట్టు పెట్టింది సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకోసమంటారా, అప్పుల కోసం. ఎవరికి తాకట్టు పెట్టారంటారా.. ఇంకెవరికి..బ్యాంకులకు, ఇతర ఆర్ధిక సంస్థలకు.
తాకట్టుపెట్టిన ప్రభుత్వ ఆస్తులు ఎక్కడివంటారా? ఎక్కడివో కావు. రాజధాని చేస్తానని జగన్ చెప్పిన విశాఖపట్నంలోనివే. తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తుల్లో విశాఖపట్టణం నగరానికి తలమానికంగా, పురావైభవానికి ప్రతీకగా నిలిచిన సర్క్యూట్ హౌస్ కూడా ఉంది. ఇంకా, తాకట్టులో ఉన్న ఆస్తులేంటి, వాటి వివరాలేంటో చూద్దాం.
విశాఖలో 12 ప్రభుత్వ స్థలాల తాకట్టు…
విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తుల తాకట్టు. ఇపుడిదే ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్కు. ఒకటి కాదు, రెండు కాదు.. మొత్తం 12 ప్రభుత్వ స్థలాలు, భవనాలను తాకట్టుపెట్టి 2019-2024 మధ్య అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ 1941 కోట్ల అప్పులు తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో, రాష్ట్ర ఆర్ధికశాఖమంత్రి పయ్యావుల కేశవ్ శాసనమండలిలో అధికారికంగా ప్రకటించారు.
విశాఖపట్నంలోని గవర్నర్ మెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన 24 ఎకరాలను తాకట్టుపెట్టి 359 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డెయిరీ పాంను తాకట్టుపెట్టి 309 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. గవర్నమెంట్ ఐటిఐ కాలేజీకి చెందిన 17 ఎకరాలను తాకట్టుపెట్టి 270 కోట్ల అప్పు తీసుకున్నారు.
ఇంకా, 9 ఎకరాల పోలీస్ క్వార్టర్స్ ను తాకట్టు పెట్టి 215 కోట్లు, ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఫర్ డిజేబుల్డ్ వెల్ఫేర్ కు చెందిన 19 ఎకరాలు తాకట్టు పెట్టి 157 కోట్లు, 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డబ్ల్యు.ఆర్.డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బంగ్లాను తాకట్టుపెట్టి 203 కోట్లు, సీతమ్మధారలో ఒక ఎకరా విస్తీర్ణంలో ఉన్న తహసిల్దార్ ఆఫీస్ ను తాకట్టుపెట్టి 34 కోట్లు, సెరీ కల్చర్ శాఖకు చెందిన 6 ఎకరాలను తాకట్టుపెట్టి 47 కోట్లు, నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పీడ్ల్యూడీ హౌస్ ను తాకట్టుపెట్టి 79 కోట్లు తీసుకున్నారు.
ఈ చిట్టా ఇంతటితో అయిపోలేదు. విశాఖపట్టణం నగర వైభవ చిహ్నాల్లో ఒకటిగా మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సర్క్యూట్ హౌస్ ను తాకట్టు పెట్టి 81 కోట్లు, నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైతు బజార్ ను తాకట్టుపెట్టి 90 కోట్లు, మూడు ఎకరాల్లోని ఆర్ అండ్ బి క్వార్టర్స్ ను తాకట్టుపెట్టి 199 కో్ట్లు ... ఇలా 12 ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి జగన్ ప్రభుత్వం రూ 1941 కోట్లను అప్పుగా తీసుకుందని అధికారిక రికార్డులు చెబుతున్నాయి.
ఇపుడు ముందుగా ఆ అప్పులకు వడ్డీ కట్టాలి.. తరువాత అసలు పూర్తిగా కడితే కానీ తనఖాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను విడిపించుకోవడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అసలు ఆరోజు వస్తుందో రాదో..! రావాలని మాత్రం ఆశగా ఎదురుచూద్దాం.