Kisan Train From Anantapur: అనంతపురం నుంచి కిసాన్ రైలు ప్రారంభం!

Kisan Train From Anantapur | అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభమైంది. అనంతపూర్ నుంచి ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ వరకు ఈ రైలు నడుస్తుంది.

Update: 2020-09-10 01:54 GMT

Kisan Train From Anantapur | అనంతపురం నుంచి ఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభమైంది. అనంతపూర్ నుంచి ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ వరకు ఈ రైలు నడుస్తుంది. ఈ కిసాన్ రైల్ ను బుధవారం ఉదయం ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌ సి.అంగడి జూమ్‌ ద్వారా జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతపురం రైల్వే స్టేషన్‌నుంచి ఈ రైలు బయలుదేరింది. అనంతపురం నుంచి బయలుదేరిన ఈ రైలు ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌‌కు చేరుకుంటుంది. ఇందులో లోడ్ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయోత్పత్తులను మార్కెట్లకు తరలిస్తారు.

321 టన్నుల పంట ఉత్పత్తులను అనంతపురం స్టేషన్‌లో లోడ్ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ త్వరగా పాడైపోయే వ్యవసాయోత్పత్తులను శరవేగంగా మార్కెట్లకు చేరవేయడానికి తాము కిసాన్ రైలును ప్రవేశపెట్టామని అన్నారు. అనంతపురం జిల్లాలో రెండు లక్షలకు పైగా హెక్టార్లలో రైతులు కూరగాయలను పండిస్తున్నారని, అలాంటి ప్రాంతం నుంచి కిసాన్ రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కిసాన్‌ రైలుతో గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని పెద్ద నగరాలకు చేరవేసే అవకాశం లభిస్తుందన్నారు. 'కిసాన్‌ రైలు ద్వారా 214 టన్నుల టమాటా, 75టన్నుల అరటి, 20 టన్నుల బత్తాయి, 2.5 టన్నుల బొప్పాయి, 8 టన్నుల కర్బూజా, పుచ్చకాయలు, 3 టన్నుల మామిడిని.. మొత్తం 322 టన్నుల సరకును దిల్లీకి రవాణా చేస్తున్నాం' అని తెలిపారు. రాష్ట్రంలో ఏటా 312.75 లక్షల టన్నుల ఉద్యానపంటలు వస్తున్నాయని.. అంతే కాదు, టమాటా, బొప్పాయి, కోకో, మిరప ఉత్పత్తిలో తొలిస్థానం, మామిడి, బత్తాయి, పసుపు ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉన్నాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.  

Tags:    

Similar News