AP Cabinet: ఆరు నెలలు ఎందుకు.. విస్తరణపై వద్దనుకుంటున్నారా?

AP Cabinet: కేబినెట్‌ మంత్రులకు ఏపీ సీఎం జగన్‌ సస్పెన్స్ సినిమాను చూపిస్తున్నారా?

Update: 2021-10-28 10:38 GMT

AP Cabinet: ఆరు నెలలు ఎందుకు.. విస్తరణపై వద్దనుకుంటున్నారా?

AP Cabinet: కేబినెట్‌ మంత్రులకు ఏపీ సీఎం జగన్‌ సస్పెన్స్ సినిమాను చూపిస్తున్నారా? మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు ఓవైపు ఆశావహులంతా తాడేపల్లి చుట్టూ చక్కర్లు కొడుతోంటే మరోవైపు సిట్టింగులు మాత్రం టెన్షన్ పడుతున్నారట. మరి మంత్రులు ఎందుకింతగా టెన్షన్‌ పడుతున్నారు? ఆశావహులకు వస్తోన్న క్లారిటీ ఏంటి? ఓవరాల్‌గా ముఖ్యమంత్రి చూపిస్తున్న సస్పెన్స్ సినిమా ఏంటి?

అత్యద్భుత విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ రెండున్నరేళ్ల పదవీకాలాన్ని వచ్చే నెల నాటికి పూర్తి చేసుకోబోతోంది. కరోనా సంక్షోభ టైమ్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆర్ధిక ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తోన్న సర్కార్ రానున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని వ్యూహాలనూ సిద్ధం చేసుకుంటోంది. అలాగే, కేబినెట్‌లో సైతం కీలక మార్పులకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. అధికారంలోకి వచ్చినపుడే రెండున్నర సంవత్సరాల తర్వాత కేబినెట్‌లో మార్పులుంటాయనీ, పాతవారిని పార్టీకి పరిమితం చేసి కొత్తవారికి చోటు కల్పిస్తామని చెప్పారు. దీంతో ఈ నవంబర్‌తో ప్రస్తుత కేబినెట్ రెండున్నరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనుండటంతో ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళనపై అధికార వైసీపీలో ఆసక్తికర చర్చకు తెరలేచింది.

ఆ తర్వాతి రెండున్నరేళ్లకు కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కవచ్చన్న దానిపై పార్టీలోనూ, బయట పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఆశావహుల సంఖ్య మళ్లీ చాంతాడంత కనిపిస్తోంది. మొదట కొంతమంది సీనియర్ మంత్రులు మినహా మిగతా మంత్రుల మార్పు ఉంటుందని ప్రచారం జరగ్గా మంత్రి బాలినేని కేబినెట్ కూర్పులో వంద శాతం మార్పులు తథ్యమని చెప్పటంతో ఊహాగానాలు స్టార్టయ్యాయి. ప్రతి జిల్లా నుంచి సామాజిక సమీకరణాల లెక్కలు, వాటిపై అంచనాలు షురూ అయ్యాయి. ఆశావహులంతా తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు తిరుగుతూ ఒకే ఒక్క ఛాన్స్ అంటున్నారు. అయితే వీరి ఆశలకు గండి కొట్టేలా ఓ వార్త ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.

అదేంటంటే ప్రస్తుత సిట్టింగ్ మంత్రుల్లో కొందరు ముఖ్యమంత్రిని ఈ మధ్య ప్రత్యేకంగా కలిశారట. కరోనా సమయంలో తమ పదవీకాలం చాలా వరకూ వృథా అయిందనీ, ప్రజలకు తాము చేయాలనుకున్న సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయామనీ ఏకరువు పెట్టారట. మంత్రులుగా మరికొంతకాలం సమయం ఇస్తే తామనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయటానికీ, తద్వారా ప్రజలకు మరింత చేరువకావటానికీ బాగుంటుందని సీఎంకు విన్నవించుకున్నారట. దీంతో వీరి విజ్జప్తులను సావధానంగా విన్న సీఎం జగన్ తనదైన శైలిలో తలూపి వారిని పంపించేశారట సో ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇలా ఇంకొన్నాళ్లు తమకు అవకాశం ఉంటుందేమోనన్న ఆశతో మిగిలిన మంత్రులు చూస్తోంటే మరోవైపు మంత్రి పదవి ఆశిస్తోన్న నేతలు ఢీలా పడుతున్నారట. ముందస్తు ఎన్నికలు రావచ్చేమో అన్న వార్తలు ఓవైపు ఎన్నికలకు ముందు ఏడాది పూర్తిగా రాజకీయ వాతావరణం మారే అవకాశం ఉంది కాబట్టి మంత్రిపదవిని చేపడితే పూర్తిగా రెండేళ్ల పదవీకాలం కూడా ఉండదన్న భావనలో సదరు ఆశావహులు ఉన్నారట. కాబట్టి ప్రస్తుత మంత్రులకు మరింత సమయం ఇచ్చే బదులు ముందుగా అనుకున్నట్లుగా రెండున్నరేళ్ల కాలానికి కట్టుబడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని చెబుతున్నారట. ఇలా తమకు మంత్రివర్గ కేటాయింపులు ఉంటే కనీసం ఏడాదిన్నర పాటైనా తాము ప్రజల్లోకి వెళ్లేందుకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారట. తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికీ, ఇతర పెద్దలకూ ఏకరువు పెడుతున్నారట.

మొత్తంగా అటు సిట్టింగులు, ఇటు ఆశావహుల మధ్య అదృష్టం ఊగిసలాడుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంకొంతకాలం తమ పదవులకు ఇబ్బందేమీ ఉండబోదన్న ఆశ సిట్టింగుల్లో కనిపిస్తోంటే ఇదే సరైన సమయం, ఇంతకు మించి దొరకదు పదవీయోగం అన్నట్లు ఆశావహుల ఆశలు వైఫైలా తిరుగుతున్నాయట. అయితే ముఖ్యమంత్రి మదిలో ఏముంది.? ఇరువర్గాల అభిప్రాయాలను విన్న ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారు..? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. మరి ముఖ్యమంత్రి స్టాండ్ ఏంటో తెలియాలంటే మరి కొంత కాలం వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News