ఆనం అసహనం వెనక అసలు కథ వేరే వుందా?

Update: 2020-06-08 10:21 GMT

మేడిపండు చూడు మేలిమై వుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఈ వేమన పద్యం సరిగ్గా నెల్లూరు రాజకీయాలకు సరిపోతుంది. ఎందుకంటే మేమంతా ఒక్కటే మాట, ఒక్కటే బాట అంటూ అధినేత ముందు డైలాగ్స్ దంచుతారు. ఐక్యత ఆహా, ఓహో అంటూ బిల్డప్ ఇస్తారు. అధినేత నుంచి అలా జరిగారో, ఫేసులకు మాస్కులు తీసేస్తారు. కొన్ని నెలలుగా నెల్లూరు జిల్లాలో ఆనం వర్సెస్‌ అదర్స్‌గా సాగుతున్న వైసీపీ వార్‌, ఇప్పుడు మరింత హీటెక్కుతోంది. వరుసబెట్టి ఆనం మీడియా సమావేశాలు పెట్టి, సొంత పార్టీపైనే రుసరుసలాడుతున్నారు. మరి ఆనం అసహనం వెనక అసలు కథ వేరే వుందా? ఏంటది?

మేడిపండు చూడ మేలిమైయుండు అన్నట్లుగా మారింది నెల్లూరు జిల్లా అధికార పార్టీ రాజకీయ పరిస్థితి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పదికి పది, పదో తరగతి ఫలితాలను చూపుతూ పరిపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగించిన వైసీపీలో, ఇప్పుడు నేతల మధ్య వ్యవహారం ఉప్పునిప్పు అన్నట్లు తయారైంది. తామంతా ఒక్కటేనన్న మాట ఇక్కడి నేతల్లో, నేతిబీరను తలపిస్తోంది.

నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఉండగా అన్నింటా వైసీపీ విజయఢంకా మోగించింది మొన్నటి ఎన్నికల్లో. సరిగ్గా ఏడాది గడవక ముందే ఇప్పుడు నేతల మధ్య అంతర్యుద్ధం, ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టు కనపడుతోంది.

జిల్లాలో పూర్తిస్థాయి ఆధిపత్యం పొందిన వైసీపీ, సరికొత్త రాజకీయ ప్రయోగానికి ఈ జిల్లాను వేదిక చేసుకుంది. జిల్లాలో మాజీ మంత్రులు, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రెందు దఫాలు శాసనసభ్యులుగా, జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌గా వ్యవహరించిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిలను పక్కన పెట్టి యువనేతలుగా ఉన్న అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌గౌతమ్‌రెడ్డిలకు అమాత్య పదవులు ఇచ్చింది ఆ పార్టీ. అందులోనూ అత్యున్నతమైన వైసీపీ ప్రధాన అజెండాలో ప్రాముఖ్యత కలిగిన జలవనరులు, పరిశ్రమల శాఖలు ఈ జిల్లాకు అప్పగించింది. ఇంత వరకు బాగానే ఉంది.

ఏడాది గడిచేలోపే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేతల మధ్య అంతరాలు పెరిగిపోయాయి. అసమ్మతి మరింత రాజుకుంటోంది. అంతకుమించిన అసహనం మొదలైంది. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి, వరుసబెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తుండటమే అందుకు నిదర్శనం. ఎమ్మెల్యేగా ఉంటూ తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

రెండు, మూడు రోజులుగా ఆనం అసహనానికి కారణమేంటి? ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసే స్థాయికి వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు జిల్లాలో ప్రధానంగా జరుగుతున్న రాజకీయ చర్చ కూడా ఇదే. 

ఆనం రాంనారాయణ రెడ్డి. నెల్లూరు పెద్దారెడ్డిని తానేనన్నట్టుగా జిల్లాలో ఒకప్పుడు చక్రంతిప్పారు. వైఎస్ హయాంలో తాను చెప్పిందే వేదంగా, చేసిందే శాసనంగా పాలించారు. కానీ కాల మహిమ, ఆయన మహిమలను మాయం చేసింది. కానీ మళ్లీ కాలం కలిసొచ్చి, అధికార పార్టీలోనే వున్నారు. కానీ కాలం కలిససొచ్చిందనుకున్నా, అసల కథ అప్పుడే ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రయోగం, ఆనం పాలిట వికటించింది. అసలు నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది..? ఎందుకీస్థాయిలో రగడ?

‌హాట్‌ హాట్‌ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రసయిన నెల్లూరు జిల్లాలో, ఇప్పటి వరకు రెడ్డి రాజకీయమే ప్రధానంగా సాగింది. అందుకే నెల్లూరులో మిగిలిన వర్గాల్లో ఎంతమంది బలమైన నేతలున్నప్పటికీ, నెల్లూరు పెద్దారెడ్డి అన్న నానుడి తెరపైకి వచ్చింది. ఒకప్పటి దొడ్ల, మేనకూరు, బెజవాడ, నల్లపరెడ్డి, నేదురుమల్లి, ఆనం, సోమిరెడ్డిల వరకు ఇదే హవా కొనసాగింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇందులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. పెద్దారెడ్డిల వారసులను జగన్మోహన్‌రెడ్డి పక్కనపెట్టారు.

జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ ‌పోలుబోయిన అనిల్‌కుమార్‌ను అందలమెక్కించారు. అమాత్య పదవి అప్పగించారు. అందులోనూ అత్యధిక ప్రాధాన్యత కలిగిన స్థానమిచ్చారు. మరోవైపు మొన్నటి వరకు అయిదు దఫాలుగా 1972 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ, ప్రత్యేక వర్గంగాలేని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డికి, ఏపీ క్యాబినెట్‌లో ఉన్నత స్థానం కల్పించారు. నవ్యాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న జగన్మోహన్‌రెడ్డి, ఆ బాధ్యతలను గౌతమ్‌కు అప్పగించారు. అధికారికంగా, పాలనాపరంగా అధినేత తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, జిల్లాలో రాజకీయంగా అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనడానికి, మారిన సమీకరణలే కారణ‌మన్న చర్చ జరుగుతోంది.

జిల్లాలో క్యాబినెట్‌కు చెందిన గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌లు అత్యున్నత అమాత్య పదవులలో ఉన్నప్పటికీ, మిగిలిన నేతల మధ్య వీరికున్న సయోధ్య పైపైకే. తలపండిన రాజకీయ కుటుంబాలను పక్కనపెట్టి అధినేత జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రయోగం ఇక్కడ విఫలమైందని కొందరు, అదిరిపోయిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

జిల్లాకు ఇద్దరు మంత్రులున్నప్పటికీ, ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా మొదటి నుంచీ కొనసాగుతోందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇదే సమయంలో ఇద్దరూ మిగిలిన ఎమ్మెల్యేలను కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే, అదీ నామమాత్రమే. జూనియర్లుగా ఉన్న యువనాయకులు, సీనియర్లను కలుపుకోవడంలో మొదటి నుంచీ పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఇందులో ప్రధాన లోపంగా ఉందన్నది రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న విమర్శ. ఈ క్రమంలోనే జిల్లాలో ఆనం కుటుంబానికీ, అనిల్‌కు మధ్య గతం నుంచీ వున్న వైరాలు, అంతకు మించిన రాజకీయ ఆధిపత్య పోరు, ఇటీవల మరింత పెరిగింది. ఏడాది కాలంలో ఆనం కుటుంబం చేతిలో వున్న వీఆర్‌కాలేజీ పూర్తిగా దూరమవడమే అందుకు నిదర్శనమంటున్నారు విశ్లేషకులు.

జిల్లాలో ఆనం అధికార, రాజకీయ ప్రాధాన్యత రోజురోజుకు కనుమరుగవుతూ వస్తోంది. ఇది ఆనం వర్గాన్ని అసహనానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వెంకటగిరి నియోజకవర్గంలో గడిచిన ఆరు నెలల కాలంలో, దాదాపుగా పదికి పైగా అభివృద్ధికి పనులకు చెందిన నివేదికలు అటకెక్కాయి. ఇది ఆనంకు ఏమాత్రం మింగుడుపడలేదు. ఇంకోవైపు నెల్లూరు నగరంలో దాదాపు 40 ఏళ్లుగా ఆధిపత్యం కొనసాగించిన ఆనం కుటుంబంలో, పెద్దగా ఉన్న వివేకానందరెడ్డి కన్ను మూశాక నగరంలోనూ ఆ కుటుంబానికి పార్టీలోనూ, ప్రభుత్వ పరంగానూ పెద్దగా ప్రాధాన్యత లేకపోయింది. ఆనం కవల సోదరులలో ఒకరుగా వున్న విజయకుమార్‌రెడ్డిని, కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా నామినేట్ చేసినప్పటికీ, దాని పట్ల ఆ కుటుంబానికి పెద్దగా సంతృప్తి లేకపోయింది. ఆనం కుటుంబంలో కవల సోదరులలో ఒకరైన జయకుమార్‌రెడ్డి మినహా, మిగిలిన అందరూ అధికార పార్టీలోనే వున్నప్పటికీ, రాజకీయంగా ప్రాధాన్యత లేదన్నది ఆనం వర్గానికి చెందిన అనుచరుల అసమ్మతి. అయితే దీనిని అధికార పార్టీలో ఆధిపత్యం కొనసాగించే అనిల్‌ ‌వర్గం, కోటంరెడ్డి వర్గం ఏమాత్రం అంగీకరించడం లేదు.

గతంలో అధికార పార్టీలో వున్న ఆనంతో అవస్థలు ఎదుర్కొని, ఇవాళ అధినేత అనుచరులుగా ఉన్న తమకు ఆ మాత్రం ఆధిపత్యం వుండదా? అన్న భావన వ్యక్తమవుతోంది. ఇటు ఆనం, అటు అనిల్‌ ‌మధ్య గతేడాది కాలంగా, పైకి అంతా ఒక్కటే అని అనిపిస్తున్నా అంతర్గతంగా ఎవరి ఆధిపత్యాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అభివృద్ధి అంశాన్ని తెరపైకి తెచ్చి తమ అక్కసును వెళ్లగక్కారు ఆనం. దీంతో ఇప్పుడు వైసీపీలో మరోసారి రాజకీయ చర్చకు తెరలేసింది.

గతంలోనూ ఆనం ఇదే తరహాలో జిల్లా రాజకీయాలపై తన నిరసన గళాన్ని విప్పారు. ఇసుక వ్యవహారం, నెల్లూరు నగరంలో రాజకీయ దాడులపై బాహాటంగా విమర్శలు చేశారు. తాజాగా మరోసారి అంతకుమించిన స్థాయిలో తన అసమ్మతిని బహిర్గతం చేశారు ఆనం. ఈసారి మరో అడుగు ముందుకేసి తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదంటూ, ప్రాధాన్యత లేకపోతే తిరుగుబాటు బావుటాకు సిద్ధమన్నట్లుగా సంకేతాలిచ్చారు. ఇది అధికార పార్టీ రాజకీయాల్లోనూ పెను సంచలనంగా మారింది.

మొన్న నియోజకవర్గ కేంద్రం వెంకటగిరిలో అధికారులను లక్ష్యంగా చేసుకుని అసమ్మతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆనం, ఈమధ్య అదే నియోజకవర్గంలో మరోసారి తమ అక్కసును వెళ్లగక్కారు. రెండు చోట్లా పరిస్థితిని గమనిస్తే తాడో పేడోకు ఆనం సిద్ధమయ్యారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే కాదు, ఇటీవల నెల్లూరు జిల్లాలో సీనియర్‌ ‌పొలిటీషియన్‌ ‌కోవూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ ‌రెడ్డి ఇదే తరహాలో పరోక్షంగా మంత్రి అనిల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. నీటిని అమ్ముకుంటున్నారంటూ ఆయన చేసిన కామెంట్‌ ‌వైసీపీలో పెద్ద దుమారమే రేపింది. ప్రతిపక్షానికి పెద్ద విమర్శనాస్త్రాన్ని ఇచ్చింది. ఆపై పార్టీ పెద్దలు నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.

మొత్తానికి నెల్లూరు జిల్లాలో జూనియర్లు, సీనియర్ల మధ్య రగడ తారాస్థాయికి చేరుతోంది. సామాజిక ప్రాధాన్యతలు, సమీకరణల ప్రయోగం కూడా మంట రాజేస్తోంది. ఆనం ఫైర్‌ విల్‌ బి ఫైర్ ‌అన్నట్టుగా ఫైర్ అవుతుండటం, ఇంకెన్ని మంటలు రేపుతోందో ఈ అగ్నిని అధిష్టానం ఎలా చల్లారుస్తుందోనన్న చర్చ నెల్లూరు వైసీపీ కార్యకర్తల్లో హాట్‌హాట్‌గా సాగుతోంది. 

Full View


Tags:    

Similar News