Anakapalle: అనకాపల్లి ఫ్లైఓవర్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం
Anakapalle: ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏను కోరిన కలెక్టర్
Anakapalle: విశాఖ జిల్లా అనకాపల్లి ఫ్లై ఓవర్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని నేషనల్ హైవే అథారిటీని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ కోరారు. అలాగే.. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కలెక్టర్. మరోవైపు.. అనకాపల్లిలోకి వెళ్లే రహదారిని మూసివేశారు అధికారులు.
అనకాపల్లి నుంచి విశాఖకు వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ పైభాగంలో అమర్చిన బీమ్‌లు నిన్న ఒక్కసారిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొన్ని వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ల సహాయంతో కారు, ఆయిల్ ట్యాంకర్‌ను బయటకు తీశారు.
అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు రహదారి విస్తరణ పనులు మూడేళ్లుగా జరుగుతున్నాయి. ఉత్తర భారతదేశానికి చెందిన డీబీఎల్ కంపెనీ ఈ పనులను నిర్వహిస్తోంది. రహదారులను విస్తరిస్తూ.. అవసరమైన చోట బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్‌లు నిర్మిస్తోంది. అయితే.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడి నాసిరకం ముడి పదార్థాలను వాడటంతోనే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.