Agriculture Invention:భీమన్న ప్రయోగం..పొలంలో కలుపు నివారణకు తేలిక మార్గం!
Agriculture invention: భీమన్న అనే గిరిజన రైతు చేసిన చిన్న ప్రయోగం పొలంలో కలుపు తీయడానికి పెద్ద సహాయంగా మారింది.
Agriculture invention: భీమన్న అనే గిరిజన రైతు చేసిన చిన్న ప్రయోగం పొలంలో కలుపు తీయడానికి పెద్ద సహాయంగా మారింది. ఏజెన్సీలో ఆదివాసీలను చూస్తే మనకు శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తుంటారు. నిశితంగా పరిశీలిస్తే వాళ్లు నివాసముండే ఇంటి నిర్మాణం దగ్గర్నుంచి, వ్యవసాయ పనిముట్లు, ఇంటికి వినియోగించే పరికరాల వరకు అడవుల్లో సమకూరే కలపతో అన్నీ వారే తయారు చేసుకుంటుంటారు. పట్టణాల్లో మాదిరిగా వీటిని సమకూర్చే వ్యవస్థ మన్యంలో లేకపోవడంతో ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో వారు శాస్త్రవేత్తలుగా మారుతుంటారు.. అదే కోవకు చెందిన గిరిజన రైతు బోయి భీమన్న. తన పొలంలో కలుపు తీయడంలో అవుతున్న ఖర్చు, పడుతున్న ఇబ్బందులే ఆయన్ను శాస్త్రవేత్తగా మార్చాయి... సమీప అడవిలో దొరికే వెదురు, కోసిన పనస దుక్క, మేకును వినియోగించి కేవం ఒకే ఒక్క రోజులో నూతన చెక్క వీడర్‌ను ఆవిష్కరించాడు.. భీమన్న స్పూర్తితో తోటి రైతు చెక్క వీడర్ తయారీ, దాని ప్రయోజనాన్ని తెలుసుకుని, తాము అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు.
విశాఖ జిల్లా, పాడేరు మండం, వంట్లమామిడి క్లస్టరు, కుమ్మరితోముకు చెందిన రైతు బోయి భీమన్న. ఐదో తరగతి వరకు చదువుకున్న తనకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు, పెద్ద అమ్మాయి 9, చిన్న అమ్మాయి 2 చదువుతుండగా, రెండో అమ్మాయికి అంగవైక్యం ఉండటతో ఇంటి వద్దే ఉంచుతున్నాడు. కొండదొర తెగకు చెందిన ఆయనకు 2.82 సెంట్ల భూమి ఉంది. దీనిలో 20 సెంట్లు పల్లం భూమి కాగా, మిగిలినదంతా పోడు కావడం వల్ల ఏటా రాగులు, జొన్నలు, వంది, రాజ్‌మా చిక్కుళ్లు సాగు చేస్తుంటాడు. పల్లం భూమిలో ఏటా వరి పంటను సాగు చేసి, వాటి నుంచి వచ్చిన ఉత్పత్తులను ఇంటి ఖర్చుకు వినియోగించుకుంటాడు. ఇదే క్రమంలో గత ఏడాది సాధారణ పద్ధతిలోనే 20 సెంట్ల భూమిలో వరి పంటను సాగు చేశాడు. దీనికి ముందుగా రూ. 800తో కొన్న పశువు గెత్తం వేసి, రూ. 600 దుక్కి చేయించాడు. రూ. 500తో 20 కిలో విత్తనాలను తీసుకుని నారు పోసుకున్నాడు. వర్షాలు కురిసిన తరువాత రూ. 600తో దమ్ము చేయించి, నలుగురికి రూ. 800లు చెల్లించి, నాట్లు వేయించాడు. నెల రోజులు గడిచాక పంటలో కలుపు రావడంతో ముగ్గురు కూలీకు రూ. 500లు చెల్లించి, శుభ్రం చేయించాడు. ఇలా రెండు దఫాలుగా రూ. 1,000 ఖర్చుతో శుభ్రం చేయించాడు. 12 పికు వచ్చాయి. పక్వానికి వచ్చిన తరువాత రూ. 1,400 ఖర్చుతో కోయించి, నూర్పించాడు. 10 బస్తా దిగుబడి వచ్చింది. వీటికి రూ. 12,500లు రాగా, పెట్టుబడి 5,700లు పోను రూ. 6,800లు మిగిలింది. వీటిలో ఎక్కువ శాతం కూలీ పనులకు ఖర్చు కావడంతో ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించాడు. అదే సమయంలో రైతు సాధికార సంస్థ, కోవెల్ ఫౌండేషన్ సిబ్బంది ప్రకృతి సేద్యంపై అవగాహన చేస్తుండగా విని, అటువైపు అడుగు వేశాడు.
కోవెల్ ఫౌండేషన్ సిబ్బంది చెప్పినట్టుగా ఈ దఫా 20 సెంట్ల భూమిలో కొంతమేర శ్రీ పద్ధతి, మరికొంత లైన్ షోయింగ్ విధానంలో సాగు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ముందుగా రూ. 150 ఖర్చుతో 6 కిలో విత్తనాలను తీసుకుని, బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుని, నారు పోసుకున్నాడు. తరువాత 20 సెంట్ల భూమిలో 600తో కొన్న పశువు గెత్తం చేసి, రూ. 600తో దుక్కి చేయించాడు. నారు ఎదిగిన తరువాత రూ. 600తో దమ్ము చేయించి, రూ. 800 ఖర్చుతో జూలై 6న శ్రీ పద్ధతిలో రెండు వరుసకు మద్య 25 సెంటీమీటర్ల దూరం వదిలి నాట్లు వేయించాడు. అయితే 20 రోజులు గడిచాక పంటలో వచ్చిన కలుపును గమనించాడు. గత ఏడాది దీనివల్లే ఎక్కువ ఖర్చయ్యిందని, స్వయంగా తీసుకోవాలంటే రాళ్ల భూమి కావడంతో గత ఏడాది చేతులకు గాయాలైన విషయాన్ని గుర్తు తెచ్చుకుని ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించాడు.
25 సెంటీమీటర్ల మధ్యలో వీడర్ మాదిరి చక్రంతో ప్రయత్నం చేస్తే బావుంటుందని అంచనాకు వచ్చాడు. 24 సెంటీమీటర్ల దళసరిగా ఉండే అడ్డంగా కోసిన పనస కర్ర చక్రాన్ని సిద్ధం చేసుకున్నాడు. దీనిపై కలుపును లాగేందుకు విలుగా రూ.60 ఖర్చుతో ఇనుప మేకు తీసుకుని, చక్రం చుట్టూ కొట్టాడు. ఈ విధంగా తయారు చేసిన చక్రానికి మద్యస్థంగా బండికి ఇరుసు మాదిరి అర అడుగు పొడవున్న రూ. 20 రెండు ఇనుము చువ్వలను రెండు వైపుల నుంచి అమర్చాడు. దీనికి ఆరున్నర అడుగుండే వెదురు బొంగును తీసుకుని, దానికి చక్రం బండి మాదిరిగా అప్పటికే సిద్దం చేసిన మేకు కొట్టిన చక్రాన్ని ఒక చివర అమర్చాడు. ఇదంతా రోజు వ్యవధిలో రూ. 100 ఖర్చుతో పూర్తి చేశాడు. అన్నింటినీ సమకూర్చుకుని నూతన చెక్క వీడర్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఇది చూస్తే వెదురు కర్రతో ఉన్న చక్రం బండి ఆకారంలో కనిపిస్తుంటుంది.
ఈ విధంగా తయారు చేసుకున్న చెక్క వీడర్‌తో పంటను శుభ్రం చేసుకున్నాడు. వరుస, వరుసను చెక్క వీడర్‌తో తోసుకుంటూ వెళ్లి, శుభ్రం చేశాడు. భీమన్న చక్రాన్ని తోసినప్పుడు దానికున్న మేకు కలుపును మద్యస్థంగా ముక్కలు చేస్తుంటాయి. దాని వెనుకే వస్తున్న చక్రం కలుపు ముక్కలను బురదలో తొక్కి పెట్టి, కుళ్లేందుకు వీలుగా చేస్తుంది. దీంతో పాటు చక్రం మద్యలో ఇరుసు మాదిరి దిగ్గొట్టిన ఇనుప చువ్వు అటు, ఇటు మూడు సెంటీమీటర్ల పొడవు ఉండటం వల్ల రెండు లైన్లకు మధ్యగా చక్రం వెళ్లేపుడు రెండు వరుసకు తగిలి, వాటిని అంటుకుని ఉన్న పురుగులు మట్టిలో పడేలా చేస్తాయి. ఈ విధంగా కింద పడ్డ పురుగును ఈ చెక్క వీడర్ తొక్కడంతో అవి చనిపోయి, పరోక్షంగా పంటకు ఎరువుగా మారతాయి.
ఈ విధంగా రెండు దఫాలుగా ఈ చెక్క వీడర్‌తో కలుపు తీయడం వల్ల కేవలం 400 ఖర్చుతోనే పని పూర్తయ్యింది. ఇదే పనికి గత ఏడాది రూ. 1,000లు ఖర్చయ్యింది. అంటే 20 సెంట్ల విస్తీర్ణానికి రూ. 600లు మిగులు కనిపించింది. ఈ విధంగా ఎకరానికి లెక్కిస్తే రూ. 3,000లు మిగులు కనిపిస్తుంది. ఇది పూర్తయిన వెంటనే రూ. 100 ఖర్చుతో బెల్లం, సెనగపిండి, ఆవుపేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన ద్రవ జీవామృతాన్ని పంటలో పారించాడు. ఈ విధంగా రెండు దఫాలుగా చెక్క వీడర్‌తో కలుపు తీయడం వల్ల ప్రస్తుతం 36 వరకు పిలకలు వచ్చాయి. ఇవి మరింత పెరుతాయని, పంట కోత పూర్తయ్యాక 12 బస్తాల వరకు దిగుబడి వస్తుందని భీమన్న అంచనా వేసుకుంటున్నాడు.
అయితే చెక్క వీడర్‌తో పలు రకాలుగా ప్రయోజనం పొందిన భీమన్న మరో అడుగు ముందుకేసి కొత్త ఆలోచన చేస్తున్నాడు. ప్రస్తుతం చెక్క వీడర్‌కే చక్రం వెనుక మూడు ఇనుప చువ్వతో నాగలి మాదిరిగా చేసి, దానికి బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. దీంతో పాటు చక్రానికి వినియోగించిన పనస జాతి కాకుండా తంగెడు, ఏగిశ కర్రను వినియోగిస్తే మరింత బరువుగా ఉండి, మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నాడు. తను అనుకున్నట్టు చేస్తే కలుపును వేర్ల నుంచి తొలగించి, చక్రం బలంగా కిందకు తొక్కడం వల్ల పంట మరింత శుభ్రం కావడమే కాకుండా, వీటి నుంచి అదనంగా ఎరువు సమకూరేందుకు దోహదపడుతుంది.