Srisailam: శ్రీశైలంలో ఆగని డ్రోన్ల కలకలం
Srisailam: గోశాల దగ్గర మరోసారి చక్కర్లు కొట్టిన రెండు డ్రోన్లు * డ్రోన్లు తిరిగిన ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Srisailam: గత కొన్ని రోజులుగా శ్రీశైలం మల్లన్న ఆలయ పరిసరాల్లో డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అర్థరాత్రి సమయంలో మాత్రమే డ్రోన్లు సంచరించడం.. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత నాలుగు రోజులుగా రాత్రిపూట సమయంలో మల్లన్న ఆలయ పరిసరాల్లో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నదానిపై క్లారిటీ లేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది డ్రోన్ల విషయమై దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా.. అర్ధరాత్రి గోశాల దగ్గర మరోసారి రెండు డ్రోన్లు చక్కర్లు కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో.. డ్రోన్లు తిరిగిన ప్రదేశాలను పరిశీలించారు జిల్లా ఎస్పీ పకీరప్ప. డ్రోన్లు ఉన్నటువంటి ఫొటో గ్రాఫర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గుప్త నిధులు, సినిమా షూటింగ్ కోసం డ్రోన్లను వాడుతున్నారా.. లేక ఉగ్రవాద కోణం ఏమైనా దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క.. ఆలయ పరిసరాల్లోని వసతి గృహాలను జల్లెడ పడుతున్న పోలీసులు.. పలువురుఅనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం.. డ్రోన్ల సంచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. దీంతో.. ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్, ఇతర సిబ్బందే కనిపిస్తున్నారు. అసలు.. డ్రోన్లు ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు. మరోవైపు.. లాడ్జీలు, సత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు.