తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు నేడు కోర్టులో విచారణకు రానుంది. సలాం కుటుంబం చనిపోతూ మాట్లాడిన చివరి మాటలు తెలుగు ప్రజలను కంటతడిపెట్టించాయి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ప్రతిఒక్కరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసు ఈ రోజు నంద్యాల కోర్టు విచారణ చేపట్టనుంది. ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు పరిశీలించనుంది. అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని టెక్షన్ వాతావరణం నెలకొంది.
ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ప్రకటిచింది. చనిపోయిన వారి మాంసానికి వెల కడుతున్నారా అంటూ సలాం భార్య అమ్మ దానిని తిరస్కరించింది. తమకు డబ్బుతో అవసరం లేదని తమ వారికి న్యాయం జరగాలని తేల్చిచెప్పింది. అయితే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హామీతో నష్టపరిహారాన్ని స్వీకరించారు. కానీ తమకు న్యాయం జరగకపోతే తిరిగి ఇచ్చేస్తామని తేల్చిచెప్పేశారు. ఒక వేళ పోలీసులకు బెయిలు మంజూరైతే ప్రత్యేక్ష ఆందోళన చేస్తామని సలాం కుటుంబసభ్యులు, బంధువులు హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.