విశా‌ఖ శివార్లలో విభిన్న గణపతి

*89 అడుగుల ఎత్తులో కొలువుదీరనున్న వినాయకుడు

Update: 2022-08-27 01:47 GMT

విశా‌ఖ శివార్లలో విభిన్న గణపతి

Visakhapatnam: వినాయక చవితికి విభిన్నరూపాల్లో గణనాధులు సిద్ధమవుతున్నారు. విశాఖ సమీపంలోని గాజువాకలో గణపతి రికార్డును సొంతంచేసుకోబోతున్నారు. వీధివీధినా వెలసిన గణనాధులతో సాటిలేనదని నిరూపించబోతున్నాడు. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రతియేటా గాజువాక ప్రత్యేకతను సంతరించుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తులోనూ.. రూపంలోనూ ప్రత్యేకతన సంతరించుకోబోతున్న గాజువాక గణపతిపై hmtv ప్రత్యేక కథనం.

విశాఖ పరిసరాల్లోని గాజువాకలో గణపతి సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాడు. కైలాస విశ్వరూప మహాగణపతిపేరుతో పూజలు అందుకునేందుకు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాడు. విగ్రహ రూపకల్పనలోనూ వైవిద్యాన్ని సంతరించుకుంది. వినాయక విగ్రహం ప్రత్యేకలతో రూపు దిద్దుకుంటోంది. విగ్రహానికి నేరుగా కళ్లు ఉండవు. విగ్రహం వెనుక భాగంలో శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. శివుని విగ్రహం నుంచి ఒక కన్ను, పార్వతి విగ్రహం నుంచి మరో కన్నును వినాయకునిగా కళ్లుగా అమర్చుతున్నారు. మండపంలో నుంచి విగ్రహాన్ని చూస్తే వినాయక విగ్రహం పరిపూర్ణంగా కనిపిస్తుంది. మండపానికి దూరం నుంచి చూస్తే శివపార్వతుల విగ్రహాలు హైలెట్ గా కనిపిస్తాయి.

 వినాయక విగ్రహం ఏర్పాటు చేయడానికి భారీ సెట్టింగ్‌‌ వేశారు. 89 అడుగుల భారీ విగ్రహం కోసం 94 అడుగుల ఎత్తు, 65 అడుగుల వెడల్పుతో ప్రత్యేక మండపం నిర్మించారు. దీనికోసం చెన్నైకు చెందిన 26 మంది కళాకారులు 60 రోజులుగా పని చేస్తున్నారు. మండపం చుట్టూ గార్డెనింగ్, వీఐపీ ఎంట్రన్స్, భక్తుల కోసం 10 లైన్ల బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మహాగణపతిని ప్రతిష్టించినచోటే నిమజ్జనం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. 18 రాత్రులపాటు ఉత్సవాలు కొనసాగుతాయి. అనంతరం ప్రతిష్టించినచోటే 70 శాతం నీళ్లు, 30 శాతం పాలతో విగ్రహ నిమజ్జన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. తరువాత ఆ మట్టిని సముద్రంలో కలుపుతారు. నిమజ్జనోత్సవానికి కృష్ణానది నుంచి ఒక ట్యాంకు వాటర్, గోదావరి నుంచి ఒక ట్యాంకు వాటర్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయకుని వద్ద నిర్వాహకులు 151 కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

 ఇన్నాళ్లు ప్రత్యేక ఆకర్షణీయంగా ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని రూపొందించే చిన్నస్వామి రాజేంద్రన్ గాజువాకలో విగ్రహాన్ని రూపొందించారు. భారీ విగ్రహాన్ని రూపొందించడంలో మరో కళాకారుడు రమేష్ కూడా కీలకపాత్ర పోషించారు. వినాయక చవితి ఉత్సవాల్లో గాజువాకకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేస్తున్నానని ఉత్సవ నిర్వాహకుడు కొసిరెడ్డి గణేష్ కుమార్ తెలిపారు. కేవలం విగ్రహం ఎత్తు పెంచడమే కాకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని నిర్ణయించుకొని వినూత్నంగా విగ్రహన్ని తయారు చేయించామని చెప్పారు. గాజువాక వినాయకుడికి 18 రోజులపాటు మహాలక్ష్మి గణపతి యాగం నిర్వహిస్తున్నామని ప్రధాన పూజారి తెలిపారు.

 తెలుగురాష్ట్రాల్లో ఎత్తైన విగ్రహంతో ప్రత్యేకతను సంతరించుకున్న గాజువాక వినాయకుడు 18 రోజులపాటు పూజలు అందుకుని కృష్ణా, గోదావరి జలాలు, పంచామృతాభిషేకంతో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News