Covid Care Center in Vizag: విశాఖలో 300 పడకల ఆక్సిజన్ కోవిడ్ కేర్ సెంటర్
Covid Care Center in Vizag: విశాఖ లో 300 పడకల ఆక్సిజన్ కోవిడ్ కేర్ సెంటర్ ను మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు.
Covid Care Center in Vizag: దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ వైరస్ విలయం కొనసాగుతున్నది. రోజువారీ కొత్త కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. చరిత్రలో తొలిసారి ఏపీలో యాక్టివ్ కేసులు 2లక్షల మార్కును దాటాయి. ఐదు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తారాస్థాయికి చేరగా, తూర్పుగోదావరిలో మళ్లీ హాహాకారాలు మొదలయ్యాయి. అప్రమత్తమైన ఏపీ సర్కార్ ఈరోజు విశాఖలోని షీలానగర్ లో 300 పడకల ఆక్సిజన్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది.
ప్రగతి భారతి ఆధ్వర్యంలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ను ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ తో ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.
విశాఖ జిల్లాలో కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పేషంట్లకు అవసరమైన చికిత్స, వసతులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థతి కొనసాగుతోంది. ఇప్పటికైన ప్రభుత్వం కేరళ తరహా కరోనా ట్రీట్మెంట్ అందించాలని ప్రజలు కోరుతున్నారు.